Home Page SliderTelangana

ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి పడిగాపులు

కొత్తగూడెంకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి 2005లో మృతిచెందగా, 2010లో అతని కొడుకు ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాడు. 2018లో ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన తర్వాత అతనిచేత సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత డబ్బు కట్టించుకున్నారు.

కొత్తగూడెంకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి 2005లో మరణించగా, 2010లో అతని కొడుకు ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాడు. 2018లో ఇంటర్వ్యూలో సెలక్ట్ అయి సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత డబ్బు కట్టించుకున్నారు. కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో కారుణ్య నియామక పత్రాలు అందిస్తామని చెప్పారు. కేలండర్‌లో సంవత్సరాలు తిరుగుతున్నా ఉద్యోగం రాకపోయే, ఆటోయే గతిగా జీవిస్తున్నాడు.

మణుగూరు ఆర్టీసీ కార్మికుడి కొడుకు సైతం కారుణ్య నియామకం కోసం నిరీక్షణ. నిబంధనల పేరుతో అధికారుల బాధ్యతా రాహిత్యం వీడకపోవడంతో మంచానపడ్డ కార్మికుడు రెండేళ్లుగా చాలా కష్టాలు పడుతున్నాడు. తినడానికి తిండి లేక, డాక్టర్ ఫీజులు చెల్లించుకోలేక ఆ కుటుంబం పడుతున్న బాధలు వర్ణనాతీతం.

నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీలో ఉద్యోగుల భవిష్యత్తు గాడి తప్పుదోందనిపిస్తోంది. 30 ఏళ్లకు పైబడి వివిధ హోదాల్లో కార్మికోద్యోగులు చేసిన శ్రమకు ఫలితం శూన్యం. సర్వీసులో ఉండి మరణించిన కార్మికుల పిల్లలకు అందించాల్సిన కారుణ్య నియామకాల్లో కాఠిన్యం కనబడుతోంది. ఉద్యోగం వస్తుందని, కుటుంబానికి ఆసరాగా నిలవ వచ్చన్న ఆశతో ఉన్న వారసులకు నిరీక్షణ తప్ప ఏమీ లాభం లేని పరిస్థితి. యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో కొందరు ప్రైవేట్ జాబ్స్‌లో, మరికొందరు కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్నారు.

దరఖాస్తుల పెండింగ్.. ఖమ్మం రీజియన్‌లోని డిపోల పరిధిలో దశాబ్దంకి పైగా కారుణ్య నియామకాలు అపరిష్కృతంగానే మిగిలాయి. వివిధ కారణాలతో మృతి చెందిన కార్మికులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో అన్‌ఫిట్ ఐన కార్మికుల పిల్లలు దాదాపు 50 నుండి 70 మంది దాకా ఉన్నట్లు సమాచారం. 2012 తరువాత సంస్థలో నియామకాలు నిలిచిపోయాయి. కారుణ్యానిదీ ఇదే పరిస్థితి. గతంలో దరఖాస్తులు చేసుకున్న వారిలో కొందరికి ట్రైనింగ్ ఇచ్చిన అనంతరం నియామక పత్రాలందించలేదు. కొంతమందిని మాత్రం కాంట్రాక్టు బేసిక్‌పై సెక్యూరిటీ గార్డులుగా నియమించారు.

వెంకన్న, ఆర్టీసీ రీజినల్ మేనేజర్: కారుణ్య నియామకాల్లో సాధ్యమైనంత వరకు రీజియన్ మొత్తం మీద న్యాయం చేశాము. ఇంకా 14 మందికి మాత్రం న్యాయం జరగాల్సి ఉంది. అన్ని ధృవీకరణ పత్రాలతో పాటు నిబంధనల ప్రకారం చేసిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఉద్యోగాలు అందించేందుకు చర్యలు చేపట్టాం.