ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ఆరా ఫౌండేషన్
◆ క్రిస్టమస్ సందర్భంగా పదివేల మందికి పైగా బట్టల పంపిణీ
◆ పండుగ ఏదైనా కులమత బేధాలు లేకుండా విస్తృతంగా సేవా కార్యక్రమాలు
◆ మానవత్వాన్ని చాటుకుంటున్న ఆరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్
ఏ భగవంతుడిని ఐనా పూజించడానికి కులం,మతం లేదని నిరూపిస్తున్నారు ఆరా ఫౌండేషన్ అధినేత షేక్ మస్తాన్. ఇప్పటికే ఆరా ఫౌండేషన్ ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతున్న మస్తాన్, ఈ క్రిస్టమస్ పండుగ సందర్భంగా వృద్ధులు, వితంతువులు , వికలాంగులు, పేద మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, సంఘ కర్తలకు, పాస్టర్లకు క్రిస్మస్ కానుకగా బట్టలు పంపిణీ చేసి మరొకసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు.

సమాజంలో మానవ జీవన విధానం ఒకరితో మరొకరికి ముడి పడి ఉంది తప్ప..కుల, మత, ప్రాంతాలతో ముడిపడి లేదని మస్తాన్ మరొకసారి రుజువు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు, నాదెండ్ల చిలకలూరిపేట రూరల్ మండలంతో పాటు పట్టణంలోని 172 చర్చిలలో గత నాలుగు రోజుల నుండి పదివేలకు పైగా కిట్లను స్వయంగా దగ్గర ఉండి బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఆరా ఫౌండేషన్ తరపున ప్రతినిధులు పలు చర్చిలలో అర్హులకు బట్టలు పంపిణీ చేశారు. దీంతోపాటు పలు చర్చిలకు క్రిస్మస్ కేకులను కూడా పంపిణీ చేశారు.

క్రిస్మస్ సందర్భంగా ఆరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్ విలేకరులతో మాట్లాడుతూ యేసు క్రీస్తు గొప్ప శాంతి దూత అని, ప్రేమకు ప్రతిక అని, ఏసుక్రీస్తు కేవలం క్రైస్తవులకుమాత్రమే చెందినవారు కాదని, అన్ని మతాలలో శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడని అన్నారు. ప్రంపంచ శాంతికొరకు పుట్టిన మహనీయుడు, శత్రువులను మిత్రులుగా మార్చి వారు శాంతి మార్గంలో పయనించేలా ప్రేమను చూపారని అని ఏసుక్రీస్తు చూపిన మార్గాన్ని అందరు అనుసరించాలని కోరారు.

నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పేదవారు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ఆరా ఫౌండేషన్ అధినేత మస్తాన్ తెలిపారు. ఆ దేవుడి కృప, ఆశీస్సులతోనే ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ప్రభువైన ఏసుక్రీస్తు తన ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపించారని అన్నారు. భవిష్యత్తులో తమ ఆరా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతామని ఆయన పేర్కొన్నారు.

