మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య-చేతి రాతతో బోర్డింగ్ పాస్‌లు
నేడు మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. దీనితో పలు సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలలో ఈ సమస్య ఏర్పడింది. ఈ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. సేవలు ఆలస్యం కావడం, క్యాన్సిలేషన్లు ఏర్పడుతున్నాయి.

ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు మాన్యువల్‌గా చెక్ చేసి, బోర్డింగు పాస్‌లు ఇస్తున్నారు. దీనితో పలువురు ప్రయాణికులు తమ బోర్డింగ్ పాస్‌లను సోషల్ మీడియాలలో షేర్ చేస్తున్నారు. తమ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిందని, వాటిని వీలైనంత త్వరలో పునరుద్ధరిస్తామని ప్రయాణికులకు ప్రకటనలు చేస్తున్నాయి విమానయాన సంస్థలు. ఈ విషయంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. కేంద్రప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతోందని, త్వరలోనే కారణాలు గుర్తించామని పేర్కొన్నారు. వీటి పరిష్కారానికి అప్‌డేట్లు కూడా విడుదల చేశామన్నారు. దీనివల్ల నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ ఎలాంటి ప్రభావానికి గురి కాలేదని మంత్రి పేర్కొన్నారు.

