ప్రాణాలు తీసిన పెంపుడు కంగారూ
“పాముకు పాలు పోసి పెంచిన తీరయ్యింది” పాపం ఆస్ట్రేలియాలోని రెడ్‌మండ్‌లోని ఆ వ్యక్తి పని. ప్రేమగా పెంచుకుంటున్న కంగారూనే అతని పాలిట మృత్యువయ్యింది. ఆదివారం జరిగింది ఈ ఘటన. ఓ కంగారూ మనిషిని చంపడం గత 86 ఏళ్ళలో ఇదే మొదటిసారంటున్నారు స్థానికులు. కంగారూ దాడిలో తీవ్రంగా గాయపడిన 77 ఏళ్ల వృద్ధుడిని గమనించిన బంధువులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అది వచ్చేటప్పటికే ఆయన ప్రాణాలు విడిచాడు. అయితే అంబులెన్స్ సిబ్బందిని కూడా కంగారూ అడ్డుకుందని, పోలీసులు దానివల్ల ముప్పు ఉందని భావించి కాల్చి చంపినట్లు తెలిపారు. ఆ కంగారూ ఏ జాతికి చెందిదన్న విషయం నిర్థారించలేదు. ఈ కంగారూ 7 అడుగుల పొడవు, 70 కేజీల బరువు ఉన్నట్లు తెలిపారు. 1936లో కూడా ఇలాంటి సంఘటన జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. రెండుకుక్కలపై కూడా ఓ పెద్ద కంగారూ దాడి చేసిన ఘటన న్యూసౌత్‌వేల్స్‌లో జరిగింది. దాని బారి నుండి వాటిని రక్షించే ప్రయత్నం చేసిన 38 ఏళ్ల విలియం క్రూక్‌షాంక్‌పై కంగారూ దాడి చేసింది. అతనికి దవడ పగిలి పోయింది. తలకు కూడా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

