Home Page Sliderhome page sliderNational

వాయుసేన అమ్ములపొదిలో శత్రు సంహరి

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం తన అమ్ములపొదిలోకి అజేయమైన శక్తిని చేర్చుకుంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ‘సుదర్శన్’ పేరుతో వాయుసేన సోమవారం ఆవిష్కరించింది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ ఆకాశ మార్గంలో శత్రు దేశాల నుండి పొంచి ఉన్న ఎలాంటి ముప్పునైనా సమర్థవంతంగా తిప్పికొట్టగలదు. 2018లో రష్యాతో కుదిరిన 5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా అందిన ఈ ఐదు రెజిమెంట్లలో ఇప్పటికే అదంపూర్, భుజ్, జోధ్‌పూర్ వంటి కీలక స్థావరాలలో మూడు రెజిమెంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పసిగట్టడం , 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు, క్షిపణులు డ్రోన్లను క్షణాల్లో నేలకూల్చడం ‘సుదర్శన్’ ప్రత్యేకత.
ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఆరు ఫైటర్ జెట్లను, అనేక డ్రోన్లను భారత భూభాగంలోకి రాకుండానే ధ్వంసం చేసి ఈ వ్యవస్థ తన సత్తా చాటుకుంది. ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేస్తూ, 36 లక్ష్యాలతో ఏకకాలంలో పోరాడగల ఈ క్షిపణి వ్యవస్థను ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ‘గేమ్ ఛేంజర్’గా అభివర్ణించారు. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల మిగిలిన రెండు రెజిమెంట్లు నవంబర్ 2026 నాటికి భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ అత్యాధునిక సాంకేతికతతో భారత గగనతలం ఇప్పుడు శత్రువులకు చొరబడలేని అభేద్యమైన కోటగా మారింది.