“కుమార్తె ఆస్తి కాదు బదిలీ చేయడానికి”-నీతా అంబానీ
ప్రపంచమే నివ్వెరపోయేలా అనంత్ అంబానీ-రాధికామర్చంట్ పెళ్లి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ కుమార్తె ఆస్తి కాదు, ఒకరికి బదిలీ చేయడానికి, ఆమె మన ఇంటికి దక్కిన ఆశీర్వాదం అన్నారు. ఈ వివాహంలో ప్రీవెడ్డింగ్ వేడుకల నుండి ప్రతీ చిన్న విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకుని వైభవంగా వివాహం జరిపించారు నీతా అంబానీ. ఈ పెళ్లి వేడుకలలో కన్యాదానం ప్రాశస్త్యాన్ని ఎంతో అందంగా, చక్కగా వివరించారు నీతా. ఆమె మాటలు విన్న అందరూ ప్రముఖులతో సహా భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు, ఏ తల్లిదండ్రులూ వారిని వేరే ఇంటికి పంపించాలని అనుకోరు. హిందూ సంప్రదాయంలో కన్యాదానం చాలా గొప్పది, కన్యాదానం చేసిన తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. కుమార్తెలు తమ పుట్టింటి అనుబంధాన్ని, ఆప్యాయతలను దూరం చేసుకోలేరు. ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది. స్త్రీ ఒక శక్తి, సరస్వతి, సాక్షాత్తూ దేవీ స్వరూపం. ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. అమ్మాయిలు తమ మెట్టినిళ్లను స్వర్గంగా మారుస్తారు. కన్యాదానం అంటే వధువు తల్లిదండ్రులు వరుడిని తమ కుమారుడిగా అంగీకరిస్తూ, కుమార్తెను అతని చేతుల్లో పెట్టడం. అలాగే వరుని తల్లిదండ్రులు కూడా వధువుని తమ కుమార్తెగా అంగీకరిస్తారు. రాధికను సంతోషంగా మా చిన్న కోడలిగా అంగీకరిస్తూ ఈ కన్యాదాన ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాము. అనంత్, రాధికలిద్దరూ భగవంతుని కృపతో కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను”.

