మణిపూర్లో అందుకే రాష్ట్రపతి పాలన
గత కొన్నాళ్లుగా జాతుల మధ్య అల్లర్లతో అట్టుడికి పోయింది మణిపూర్. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయాలంటూ ఎప్పటి నుండో డిమాండ్లు వస్తున్నాయి. ఎట్టకేలకు ఇటీవల ఆయన రాజీనామా సమర్పించారు. అయితే కొత్త ముఖ్యమంత్రి విషయంలో పార్టీ అధిష్టానంతో రాష్ట్ర బీజేపీ నేతలు సంప్రదింపులు జరిగినప్పటికీ ఎలాంటి ఏకాభిప్రాయానికి రాలేదు. దీనికి తోడు అక్కడి పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ సమర్పించిన నివేదిక సమాచారాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ రాజ్యాంగబద్ద పాలన కొనసాగించే అవకాశం లేదని నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చారు. రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టే అంశంపై అనేక తర్జనభర్జనలు జరిగినప్పటికీ, చివరికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అధికారాలు ఉపయోగించి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలనే నిర్ణయించినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. దీనితో సీఎం రాజీనామా అనంతరం జరగాల్సిన రాష్ట్ర శాసనసభా సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆదేశాలిచ్చారు.