Andhra PradeshHome Page Slider

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కు ఖరారైన ముహూర్తం ?

  • ఫిబ్రవరి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు
  • కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సమాచారం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం
  • ఏపీలో ఇప్పటికే మొదలైన ఎన్నికల హడావుడి
  • అభ్యర్థుల ఎంపికలో ముమ్మర కసరత్తు లు చేస్తున్న వైఎస్ జగన్
  • నేడు యువగళం విజయోత్సవ సభలో ఎన్నికల శంఖారావం పూరించనున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు

ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఫిబ్రవరి 10వ తేదీన ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగానే ముహూర్తం కూడా ఖరారు అయినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సమాచారం కూడా వచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. 2019 సాధారణ ఎన్నికలకు సంబంధించి మార్చి మూడో తేదీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు గత ఎన్నికల కంటే 20 రోజులు ముందుగానే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నాయి. ఇటీవల వైఎస్ జగన్ కూడా మంత్రులతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత రెండు రోజుల క్రితం ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిబ్రవరిలోనే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని ఆ దిశగా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలను క్యాంపు కార్యాలయానికి పిలిపించి వారితో చర్చలు జరుపుతున్నారు. స్థాన చలనం చేస్తున్న ఎమ్మెల్యేలకు ఎందుకు స్థాన చలనం చేయాల్సి వచ్చిందని వివరిస్తున్నారు అలానే టికెట్లు ఇచ్చే పరిస్థితి లేని ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా మరో పదవి ఇస్తానని వారికి భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సందడి మొదలైంది.

గురువారం రెండో జాబితా జగన్ ప్రకటిస్తారని సర్వత్రా ప్రచారం సాగుతుంది. ఇక ఏపీలో రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ పార్టీ ప్రధాన నేతలు ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తిరుగుతున్నారు. ఆ పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నం సమీపంలోని పోలేపల్లి వద్ద తెలుగుదేశం పార్టీ యువగళం – నవశకం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని తెలుగుదేశం, జనసేన పార్టీలు పూరించనున్నాయి. యువగళం – నవశకం సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సభగా తెలుగుదేశం జనసేన పార్టీలు భావిస్తున్నాయి. యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించనున్నారు. అలాగే ఇరు పార్టీలకు చెందిన ముఖ్యకీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. 2014 ఎన్నికల అనంతరం తొలిసారి సభా వేదిక పైకి ఉమ్మడిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బుధవారం ప్రసంగించనున్నారు. దీంతో మరో వంద రోజుల్లో జరగనున్న సాధారణ ఎన్నికలకు ఏపీలోని అన్ని పార్టీలు సిద్ధమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.