నీవు ‘పుంగనూరు పుడింగివా’.. చంద్రబాబు ఆగ్రహం
టిడిపి నేత చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుంగనూరులో చంద్రబాబు సభ సందర్భంగా టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర సంఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి కారణం అక్కడ మంత్రి పెద్దిరెడ్డేనని చంద్రబాబు ఆరోపించారు. ‘నువ్వు పుంగనూరు పుడింగివా’ అంటూ, ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి దుర్ఘటనపై విచారణ కమిటీ వేయాలని దోషులను శిక్షించవలసిందేనని డిమాండ్ చేశారు. ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ అంటూ చంద్రబాబు నాయుడు నేడు అంగళ్లు నుండి పుంగనూరు బయలుదేరారు. అయితే వైసీపీ శ్రేణులు చంద్రబాబును అడ్డుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రహదారికి అడ్డంగా లారీని అడ్డుపెట్టారు. ఈ లారీని అడ్డుతొలగించాలంటూ ఆందోళనలు చేశారు టిడిపి వారు. దీనితో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ కోపంతో పోలీస్ వాహనాన్ని ఎవరో ధ్వంసం చేశారు. దీనితో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. భారీ సంఖ్యలో మొహరించిన కార్యకర్తలు, నాయకుల కార్లు ధ్వంసమయ్యాయి. వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. త్వరలోనే వైసీపీ భూస్థాపితం అవుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.

