వైయస్సార్సీపీలోకి ముద్రగడ పద్మనాభం ?
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన త్వరలోనే రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో బుధవారం ముద్రగడ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. గతం గతః అంటూనే ఎన్నో కీలక విషయాలను ప్రస్తావించారు. తన తాత, తండ్రి చూపిన బాటలోనే నడుస్తున్నట్లు చెప్పారు. తుని సభ తర్వాత రోజు తనను అభిమానించే వ్యక్తులు 6000 మందిని, పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని మరో 10 వేల మంది దారిలో ఉన్నారని తనను అరెస్టు చేసి తీహార్ జైలుకు తీసుకెళ్లటానికి హెలికాప్టర్ సిద్ధంగా పెట్టారన్నారు.

బెయిల్ తెచ్చుకోండి లేదా అండర్ గ్రౌండ్ కు వెళ్లాల్సిందిగా తనకు సలహా ఇచ్చారన్నారు. ఆ రెండింటిలో తాను ఏది చేసినా కులంతో పాటు ఉద్యమం కూడా చులకన అయ్యేది అన్నారు. తుని సభకు తానే కారణమని ఎలాంటి కేసులైన తన మీద పెట్టమని దహనకాండకు తమకు ఎలాంటి సంబంధం లేదని నాటి డిజిపికి లేఖ రాశానన్నారు. ఈ నేపథ్యంలో గడిచిన కొన్నేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ మధ్య మధ్యలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించి తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అడుగులు అధికార వైయస్సార్సీపీ వైపు పడుతున్నాయి. వైఎస్ఆర్సీపీలో చేరటానికి ఆయనకు దాదాపు లైన్ క్లియర్ అయిందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన చేరికకు సీఎం జగన్ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కీలకమని అధికార విపక్షాలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం మళ్లీ రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయం పార్టీలను కలవరానికినికి గురిచేస్తుంది. కాపు సామాజిక వర్గంలో తనదైన ముద్ర వేసుకున్న ముద్రగడ చివరిసారిగా 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయితే ఇంతవరకు ఆయన తన మనసులో మాట ఏ పార్టీలో చేరుతున్నారు అనేది చెప్పకపోయినా ఇప్పుడు తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ, జనసేనలోకి వెళ్లే అవకాశం కనిపించడం లేదు ఇక బీజేపీ,కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న స్థితిలో అటువైపు చూసే అవకాశం ఏమాత్రం లేదు. ఈ నేపథ్యంలో ఆయన అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు నుంచి వ్యక్తం అవుతుంది. తన భవిష్యత్తు కన్నా, చిన్న కుమారుడు గిరిబాబు రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.

