కేసీఆర్‌కు ట్రక్కు నిండా షర్మిల గిఫ్ట్!
తెలంగాణలోని పలు జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై దృష్టి సారించాలంటూ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల దెబ్బతిన్న పంటలతో కూడిన ట్రక్కును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా పంపారు. ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు ఎన్నడూ లేని విధంగా నష్టాలను మిగిల్చాయని, మంచి పంట ఆశించిన రైతుల ఆశలకు పెద్ద దెబ్బ తగిలిందని ఆమె అన్నారు. పంట నష్టంతో కూడిన ట్రక్కును మీడియాకు ప్రదర్శించిన షర్మిల, కేసీఆర్ సర్కారు తీరును ఎండగట్టారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దెబ్బతిన్న పంటను కేసీఆర్‌కు పంపుతోందని… కనీసం ఎన్నికల సంవత్సరంలోనైనా, కేసీఆర్ గాఢనిద్ర నుండి మేల్కొని తగిన విధంగా రైతులకు మేలు చేయాలన్నారు.
రైతులకు నష్టపరిహారం అకాల వర్షాల వల్ల దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. కానీ ఒక్క అధికారిగానీ, ఎమ్మెల్యేగానీ రైతులను పరామర్శించి నష్టాన్ని చూసిన పాపాన పోలేదన్నారు. 1600 కోట్లతో కొత్తగా నిర్మించిన సచివాలయంలో ఫోటోలు తీసుకోవడంలో నాయకులు బిజీగా ఉన్నారన్నారు షర్మిల. రైతులు అధిక వడ్డీకి అప్పులు చేసి పంటల కోసం బంగారాన్ని అమ్ముకోవాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఈ ట్రక్కు రైతుల కన్నీళ్లను సీఎం దృష్టికి తెస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో పంట నష్టం ₹ 14000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా, ఈ నిర్లక్ష్య ప్రభుత్వానికి పంటల బీమా అనే భావన లేకపోవడమే కారణమన్నారు. పంటల బీమా లేనప్పుడు కనీసం ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్నారు.
పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు కనీసం ₹ 30,000 పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. వరి సేకరణ వెంటనే ప్రారంభించాలని, 7500 ఐకెపి కేంద్రాల ఏర్పాటు హామీ కూడా విఫలమైందన్నారు. ప్రస్తుతం కేవలం 2500 లోపు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్‌పై, అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. “ఇదేనా భరోసా, ఇదేనా కిసాన్ సర్కార్? పంటల బీమా ఇవ్వని, ఇన్‌పుట్ సబ్సిడీలను పొడిగించని, రైతులను ఆదుకునే విషయంలో ప్రతి విషయంలోనూ విఫలమవుతున్న సర్కార్ ఇదేనా?” షర్మిల దుయ్యబట్టారు.

