వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే : చంద్రబాబు నాయుడు
ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా పది నెలల సమయమే ఉందని ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ఆయన పని అయిపోయినట్లేనని, జగన్ ను బోను ఎక్కించడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. జగన్ తో ప్రస్తుతం ఉన్న బటన్ బ్యాచ్ సైతం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ఓటు వేస్తుందని ఆయన భాష్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని ప్రజల కోసం తిరిగి అధికారం దక్కించుకునే వరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. బుధవారం విశాఖపట్నంలో జరిగిన తెలుగుదేశం పార్టీ జోన్ 1 సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్ష హోదాలో చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అంటున్నట్లు వై నాట్ 175 కాదు ఇప్పుడు చెబుతున్న వై నాట్ పులివెందుల అని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రస్తుతం పార్టీకి లభిస్తున్న స్పందన ఆదరణ చూస్తే స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశం పార్టీ నే అన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది శాంపిల్ గెలుపు మాత్రమే అన్న చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో పెద్ద విజయం తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకోబోతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 20 రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించిన ప్రజలు మద్దతు పలికి గెలిపించారని అన్నారు. ఈ నాలుగేళ్ల లో ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదని ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టును పట్టించుకోలేదని వంశధార నాగావళి నదుల అనుసంధానానికి అప్పట్లో తెలుగుదేశం పార్టీ 1600 కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం వచ్చాక 400 కోట్లు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. రిషికొండను పూర్తిగా బోడిగుండు చేశారని విశాఖకు మెట్రో రైలు అడ్రస్ లేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తాజాగా యూనిట్‌కు 40 పైసలు భారం వేసారని ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నారని చెత్త పన్ను కూడా ఆరు నెలలకు ఒకసారి ఆస్తి పన్నులో కలిపి వసూలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. సైకో పోయి సైకిల్ పాలన రావాలని ఆయన నినదించారు.

