Home Page SliderNational

ప్రధాని మోదీకి నేనంటే భయం.. శాశ్వ తంగా అనర్హత వేసుకోండి: రాహుల్

సూరత్ కోర్టు తీర్పు, లోక్ సభలో అనర్హత వేటు తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం ఆరంభం నుంచి అదానీ, సూట్ కేసు కంపెనీల్లో 20 వేల కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయని.. ఎవరు అందుకు అనుమతిచ్చారో చెప్పాలని ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. దేశంలో ఏ వ్యవస్థ అయినా అదానీ కోసం రూల్స్ మార్చేస్తోందన్నారు. అదానీకి సంబంధం లేని వ్యాపారాలు చేసేందుకు కేంద్రం సహకరిస్తోందని దుయ్యబట్టారు. ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం అదానీ సంస్థలకు నిబంధలను ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. ఎయిర్ పోర్టులు ఎందుకు అదానీ సంస్థకే ఇస్తున్నారో ప్రధాని మోదీ దేశానికి సమాధానం చెప్పాలన్నారు రాహుల్. దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ అదానీ గ్రూపుకు ప్రాజెక్టులు రావడానికి కారణం ఎవరో దేశానికి వివరించాలన్నారు.


అనర్హతతో తన నోరు నొక్కలేరన్నారు

జైల్లో పెడితేనో, అనర్హత వేస్తేనే నోరు మూసుకొని చూస్తూ కూర్చునే వ్యక్తిని తాను కానన్నారు రాహుల్. తాను గాంధీ కుటుంబం నుంచి వచ్చానని… దేశం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. ప్రధాన మంత్రిని పార్లమెంట్‌లో ఓ ప్రశ్న అడిగా… 20 వేల రూపాయలు అదానీ గ్రూపుల్లో ఎందుకు పెట్టించారో చెప్పండని కోరా… సూట్ కేసు కంపెనీల్లో 20 వేల కోట్లను ఎలా పెట్టుబడి పెట్టించారో చెప్పాలని ప్రశ్నించానన్నారు. అదానీతో తనకు ఉన్న రిలేషన్‌షిప్ ఏంటో మోదీ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. గుజరాత్ సీఎంగా ఉన్న రోజుల నుంచి అదానీతో మోదీ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని.. అందుకు సాక్ష్యాలు కూడా చూపించానన్నారు.

అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే అనర్హత

సూరత్ కోర్టు తీర్పుతో తానేదో భయపడిపోతున్నానని కొందరు భావిస్తున్నారని.. తనకు జైలంటే భయం లేదని రాహుల్ స్పష్టం చేశారు. లోక్ సభ తనపై వేసిన అనర్హతను ఖాతరు చేయబోనన్నారు. అదానీ అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. దేశంలో అదానీ కోసం రూల్స్ మారిపోతున్నాయని… ఎందుకు ఎలా చేస్తారని ప్రశ్నిస్తే.. మంత్రులు సమాధానం ఇవ్వలేకపోతున్నారన్నారు. పార్లమెంట్ వేదికగా మంత్రులు అబద్ధాలు చెబుతున్నారన్నారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. తాను పార్లమెంట్‌లో అదానీ అంశం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం అందుకు అనుమతించలేదన్నారు. అదానీ అంశం నుంచి దేశాన్ని పక్కదోవ పట్టించేందుకే.. అనర్హత అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ.

ఎన్నడూ విదేశీ జోక్యం కోరలేదన్న రాహుల్

తాను విదేశాలకు వెళ్లి… ఇండియాను చూలకనే చేసి మాట్లాడలేదని… ఎన్నటికీ విదేశీ జోక్యం కోరలేదని రాహుల్ తేల్చి చెప్పారు. ఇండియాకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడబోనన్నారు. విదేశీ జోక్యం కోరలేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను గొంతు విప్పుతూనే ఉంటానన్నారు. అదానీ కోసం రూల్స్ రాత్రికి రాత్రే మారిపోతున్నాయని ప్రశ్నిస్తే తనపై కక్షగట్టారన్నారు. సత్యాన్ని చెప్పడానికి ఎప్పటికీ అంగీకరించనన్నారు రాహుల్. సత్యం మాట్లాడుతూనే ఉంటానన్నారు. ప్రధాని మోదీ-అదానీ సంబంధంపై మాట్లాడేందుకు అసలే భయపడబోనన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. సభలో ఏం మాట్లాడతానోనని ప్రధానికి నేనంటే భయమన్నారు రాహుల్. అందుకే సభలో తనపై అనర్హత వేటు వేశారన్నారు. తాను జీవితంలో ఏ కులాన్ని ఎప్పుడూ కూడా టార్గెట్ చేసి మాట్లాడలేదన్నారు. అదానీ-మోదీ సంబంధమేంటన్నదానిపై మాట్లాడుతూనే ఉంటానన్న రాహుల్… భయపెట్టి నా గొంతును మూయించలేరన్నారు.

20 వేల కోట్ల ఎందుకిచ్చారో చెప్పాల్సిందే

నిజం మాట్లాడటమన్నది తన ముందున్న లక్ష్యమన్నారు రాహుల్ గాంధీ. పార్లమెంట్‌లో జరుగుతున్న డ్రామా అంతా ప్రధానిని, అదానీ ఇష్యూ నుంచి పక్కదోవ పట్టించేందుకేనన్నారు. పార్లమెంట్ నుంచి అనర్హత వేటు వేస్తారోమో గానీ… తన మార్గాన్ని, కర్తవ్యాన్ని ఆపలేరన్నారు. జైలుకు వెళ్లడానికి భయం లేదన్న రాహుల్… సత్యాన్ని కనుగొనడానికి తపస్సు కొనసాగిస్తూనే ఉంటానన్నారు. 20 వేల కోట్ల రూపాయలు అదానీ సంస్థల్లో ఎందుకు పెట్టించారో దేశానికి ప్రధాని సమాధానం చెప్పాల్సిందేనన్నారు రాహుల్. శాశ్వతంగా తనపై అనర్హత వేసుకునే అవకాశం బీజేపీకి ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి… రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు.