మోదీ బాటలో రాహుల్
సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టారు. దేశ వ్యాప్తంగా ప్రజలను కలవడంతోపాటు, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడం, భారత ఐక్యత కోసం జోడో యాత్ర చేపట్టినట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించారు. తమిళనాడులో ప్రారంభమైన యాత్ర దక్షిణాది ముగించుకొని మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ చేరుకొంది. గాంధీ కుటుంబం చిటికెస్తే రాజకీయాలు నడుస్తాయన్న పరిస్థితి నుంచి రోడ్లపైకి వచ్చి నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుంటే తప్ప భవిష్యత్ మనుగడ సాధ్యం కాదన్న పరిస్థితిల్లో రాహుల్ గాంధీ జోడో యాత్రకు సిద్ధమయ్యారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారు. ప్రజల సమస్యలను, ఇష్యూలను తనదైన కోణంలో తెలుసుకుంటున్నారు.

2014లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ 2019లోనూ కోలుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి కూడా రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుతున్నారంటూ G-23 నేతలు కొంతకాలం తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం… మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావడం జరిగిపోయాయి. అప్పటి వరకు పార్టీ వ్యవహారాలన్నింటినీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు తన ఫోకస్ అంతా భారత్ జోడో యాత్రపై పెడుతున్నట్టుగా కన్పిస్తోంది. భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో వీలైనంత ఎక్కువ మందిని కలిసి.. వారితో మమేకమవ్వాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. సమయమూ, సందర్భం కలిసొస్తే.. లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని ప్రభావం చూపెడితే.. సీన్ ఒక్కసారిగా రివర్స్ అవుతోందని విశ్వసిస్తున్నారు. అందుకే గుజరాత్ ఎన్నికలు హోరాహోరీ జరుగుతున్నప్పటికీ.. రాహుల్ గాంధీ మాత్రం యాత్రపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. గుజరాత్‌లో రాహుల్ గాంధీ ప్రచారం చేసినా పెద్దగా మార్పు రాదన్న భావనలో ఆ పార్టీ ఉంది. యాత్ర మధ్యలో గుజరాత్ ఫలితాలు ఇబ్బంది కలిగిస్తాయోమోనన్న భావనలో రాహుల్ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకగణానికి ఆ బాధ్యతలు అప్పగించి.. తాను మాత్రం యాత్ర నిర్వహించుకుంటూ ముందుకుసాగుతున్నారు.

మధ్యప్రదేశ్ లో భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. వాస్తవానికి 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గట్టిగా పోరాడారు. కన్పించిన దేవాలయాలకు వెళ్లడమే కాదు.. తాను శివభక్తుడనంటూ ఘనంగా చెప్పుకున్నారు. తాజాగా రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ యాత్రలోనూ తాను శివ భక్తుడనని నిరూపించుకునే పని చేశారు. ఉజ్జయినీలో జ్యోతిర్లింగేశ్వర స్వరూపామైన మహాకాళేశ్వరుడ్ని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అంతే కాదు.. సనాతన సంప్రదాయం ఉట్టిపడేలా వేషధారణ, ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహాదేవునికి సాష్టాంగ నమస్కారాలు చేయడంతోపాటు, స్వామివారి సేవలో పాల్గొన్నారు. కచ్చితంగా ఈ దృశ్యాలు చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుకురాక మానరు. ప్రధాని మోదీ కేదారీనాథ్ వెళ్లినప్పుడు నిర్వహించిన పూజలు కన్పిస్తాయ్. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయాల సందర్శనలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. ఆయా ఆలయాల చరిత్ర ఆధారంగా, అందుకు తగిన విధంగా వేషధారణలోనూ, ఆహర్యాన్ని ప్రతిబింబించేవారు.

తాజాగా రాహుల్ గాంధీ ఉజ్జయినీలో మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించినప్పుడు ఇలాంటి ఫీలింగే కలుగుతోంది. దేశంలో మోదీ ప్రభంజన తర్వాత ఎనిమిదేళ్లుగా అధికారంలోకి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత సత్తా చాటాలని భావిస్తోంది. ఒక్కో రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతున్నప్పటికీ… తిరిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీతో భారత్ జోడో లాంటి ప్రతిష్టాత్మక యాత్రకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. మొత్తంగా మోదీని తట్టుకొని నిలబడేందుకు రాహుల్ గాంధీ ఒక్కో అడుగు వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఉజ్జయినీలో స్వామి దర్శనం తర్వాత ఆయన్ను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారట. జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కొంత మేర మారారని.. త్వరలో పూర్తి స్థాయిలో మారతారని.. కాంగ్రెస్ పార్టీకి అది మేలు కలిగిస్తోందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట.


