International

కెర్చ్ వంతెనపై భారీ పేలుడు..ఉక్రెయిన్ పనేనా?

రష్యా -క్రిమియాను కలిపే కెర్చ్ వంతెనపై భారీ పేలుడు సంభవించింది. కెర్చ్  వంతెనపై ఈ రోజు కారు బాంబు పేలినట్లు తెలుస్తోంది. అదే  సమయంలో ఆ వంతెనపై నుంచి క్రిమియాకు ఏడు ఆయిల్ ట్యాంకర్లు వెళ్తున్నాయి. ఈ మంటలు కాస్త ట్యాంకర్లకు అంటుకోవడంతో  భారీ పేలుడు సంభవించిందని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి.  దీంతో కెర్చ్ వంతెనపై భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీని కారణంగానే వంతెనపై పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అంతేకాకుండా ఆ మంటల తీవ్రతకు వంతెనపై కొంతభాగం కూలి సముద్రంలో పడింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి వుంది. ఈ కెర్చ్ వంతెన అజోవ్ సముద్రాన్ని, నల్ల సముద్రాన్ని కలుపుతుంది.

ఉక్రెయిన్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఈ నల్ల సముద్రం ద్వారా నిర్వహిస్తోంది. అజోవ్ తీరం నుంచి నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ వాణిజ్యం సాగాలంటే కెర్చ్ వంతెనని ఎట్టి పరిస్థితుల్లో దాటాల్సిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం రష్యా ఎన్నో ఏళ్ళ నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. క్రిమియా ద్వీపాన్ని 2014లో రష్యా స్వాధీనం చేసుకుంది. అనంతరం రష్యా-క్రిమియాను కలిపేలా 2018లో 3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి రోడ్డు, రైలు మార్గం ఉండేలా ఈ కెర్చ్ వంతెనను మాస్కో నిర్మించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ వంతెనపై ట్రక్కును కూడా నడిపారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌పై యుద్దం సాగిస్తున్న క్రెమ్లిన్ ఈ కెర్చ్ వంతెన మీదుగానే ఆయుధాలు, బలగాలను చేరవేస్తుంది. ఈ రోజు కెర్చ్ వంతెనపై జరిగిన ప్రమాదం ఉక్రెయిన్ పనేనని క్రిమియా అధికారి ఆరోపించారు. ఈ వాఖ్యలు ప్రస్తుతం రష్యా , ఉక్రెయిన్ మధ్య  తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి  ఇటీవల కాలంలో ఉక్రెయిన్ కమాండర్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. దీంతో రష్యా సేనలను అడ్డుకునే క్రమంలోనే ఉక్రెయిన్ ఈ కుట్రకు పాల్పడి ఉంటుందని రష్యా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. తాజా పేలుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇప్పటికే ఉన్న యుద్ద వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.