InternationalNews

మంగళ్యాన్‌కు మంగళం..! ముగిసిన ఆర్బటర్‌ సేవలు

అంగారక గ్రహంపైకి భారత్‌ ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ‘మంగళ్యాన్‌’ ప్రస్థానం ముగిసింది. అంచనాలకు మించి ఎనిమిదేళ్ల పాటు సేవలందించిన మంగళ్యాన్‌ అనే మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌లో ఇంధనం, బ్యాటరీ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో సుదీర్ఘ పరిశోధనకు తెరపడిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ ఉపగ్రహాన్ని 2013, నవంబరు 5వ తేదీన రూ.450 కోట్ల వ్యయంతో ఇస్రో ప్రయోగించింది. 300 రోజుల్లో 40 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ ఉపగ్రహం అంగారక గ్రహం కక్ష్యలోకి 2014 సెప్టెంబరు 24వ తేదీన ప్రవేశించింది.

8 ఏళ్లపాటు సేవలందించిన ఉపగ్రహం

ఆరు నెలల పాటు మాత్రమే పని చేసేలా రూపొందించిన ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు సేవలందించడం విశేషం. అంగారక గ్రహం చుట్టూ తిరుగుతూ అక్కడ వివిధ వాతావరణ పరిస్థితుల్లో 8 వేలకు పైగా ఫొటోలు పంపించింది. మార్స్‌ అట్లాస్‌ను అందించింది. సూర్యరశ్మి లభించని ‘గ్రహం దశ’ను తప్పించేందుకు ఈ వ్యోమ నౌక కక్ష్యను పలుమార్లు మార్చాల్సి వచ్చింది. దీంతో ఇందులోని ఇంధనం పూర్తిగా ఖర్చయింది. మంగళ్యాన్‌లోని బ్యాటరీ ఒక గంట 40 నిమిషాల గ్రహణాన్ని మాత్రమే తట్టుకోగలదు. అంతకంటే ఎక్కువ సమయం సూర్యకాంతి లభించకుంటే బ్యాటరీ చార్జింగ్‌ పడిపోతుంది.

వాయిదా పడుతున్న మంగళ్యాన్‌-2

అయితే.. ఈ ఉపగ్రహానికి ఇటీవల పలుసార్లు గ్రహణ పరిస్థితులు ఎదురయ్యాయయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో ఒకసారి ఏడున్నర గంటల పాటు మంగళ్యాన్‌కు సూర్యరశ్మి లభించలేదు. అందుకే దీని బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇంధనం కూడా అయిపోయింది. ఫలితంగా మంగళ్యాన్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. అంగారక గ్రహం ఉపరితల లక్షణాలు, స్వరూపం, ఖనిజాలు, వాతావరణ పరిస్థితులపై పరిశోధనలకు మంగళ్యాన్‌లో ఐదు పరికరాలు (మార్స్‌ కోలార్‌ కెమెరా, థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ స్పక్ట్రోమీటర్‌, మీథేన్‌ సెన్సార్‌ ఫర్‌ మార్స్‌, మార్స్‌ ఎక్సోస్పిరిక్‌ న్యూట్రల్‌ కంపోజిన్‌ ఎనలైజర్‌, లైమన్‌ ఆల్ఫా ఫోటోమీటర్)  అమర్చారు. మరోవైపు.. గతేడాది డిసెంబరులో ప్రయోగించాల్సిన మంగళ్యాన్‌-2 సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.