ఉక్రెయిన్ నుండి రష్యా భద్రతా దళాల ఉపసంహరణ
“బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ”
ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు. తాను బలవంతుడినని, విర్రవీగేవాడు కూడా పరిస్థితులు కలిసి రానప్పుడు అల్పులైన వారి చేతిలో పరాజయం పాలవుతారు. బలమైన సర్పము కూడా అల్పప్రాణులైన చీమల చేతిలో చచ్చినట్లు జరుగుతుంది. అగ్రరాజ్యంగా విర్రవీగుతూ చిన్నదేశమే కదా అనుకొని ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడిన రష్యాకు నూటికి నూరుపాళ్లూ ఈ సుమతీ శతకం వర్తిస్తుంది.

ప్రపంచ మిలటరీలో రెండవస్థానం, ఆధునిక టెక్నాలజీ, అన్ని రంగాల్లో సంపన్న దేశం, రెండు ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఇవేవీ రష్యాను ఉక్రెయిన్‌పై గెలిపించలేకపోయాయి. రష్యా సేనలు ఒక్కొక్కటిగా ఉక్రెయిన్‌లో ఆక్రమించిన ప్రాంతాలను వీడి వెనుదిరుగతున్నాయి. డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వతంత్ర్యంగా ప్రకటించి,వేరే దేశంగా మార్చాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. అంతేకాదు 2014 నుండి రష్యా అధీనంలో ఉన్న క్రిమియాను కూడా కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఉక్రెయిన్‌కు పోర్టులు, సముద్రమార్గం లేకుండా చేద్దామన్నదే రష్యా ప్రధాన లక్ష్యం.

కేవలం వారం రోజుల్లో ఉక్రెయిన్‌ను ఆక్రమించొచ్చనే ఉద్దేశంతో యుద్ధం ప్రారంభించిన రష్యా, నెలలు గడుస్తున్నా, పైచేయి సాధించలేకపోయింది. ఓ దశలో రష్యా సేనలు నీరసించి పోవడంతో కీవ్ శివార్లలో ఉన్న 65 కిలో మీటర్ల భారీ కాన్వాయ్‌ని వెనక్కి రప్పించింది. చివరకు ఆయుధాలు కావాలంటూ చైనా, ఉత్తర కొరియాలను అడగాల్సిన పరిస్థితికి చేరుకుంది.
ఓ ప్రక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం ముందు నుంచి రష్యా అకృత్యాలను ప్రపంచదేశాలకు వివరిస్తూ, ఆయుధాలు సమకూర్చుకుంటున్నాడు. ఈ నెల ఆరంభం నుండే విజృంభించి, రష్యాపై ఎదురుదాడిని తీవ్రం చేశారు. ఇప్పటి వరకూ 6 వేల కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి కైవసం చేసుకున్నట్లు సోమవారం రాత్రి జెలెన్‌స్కీ ప్రకటన చేశారు.
రష్యాకు జరిగిన నష్టం
5800 మంది రష్యా సైనికులను ఇప్పటి వరకూ హతమార్చినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఏడునెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో రష్యాకు చెందిన 2,175 యుద్ధట్యాంకులు, 4,662 ఫైటర్ వెహికల్స్, 1,279 ఆర్టిలరీ, 311 మల్టిపుల్ రాకెట్ లాంచర్స్, 244 యుద్ధ విమానాలు, 165యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్స్, 900 డ్రోన్స్, 213 హెలికాఫ్టర్స్, 3,450 మిలిటరీ వాహనాలు, 15 యుద్ధ నౌకలు ధ్వసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

పాశ్చాత్య దేశాలు ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్, రష్యాపై ఎదురుదాడికి దిగుతోంది. దీనితో క్రిమియాలోని రష్యా బలగాలు వెనుదిరుగుతున్నాయి.

