తల్లి కోసం తల్లడిల్లుతున్న పిల్ల గుర్రం
లోకంలో అమ్మ ప్రేమ వర్ణించలేనిది. పిల్లలే తన జీవితంగా బతుకుతుంది అమ్మ. అమ్మ ప్రేమ అనేది మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటుంది. బిడ్డపై అమ్మకు ఎంత ప్రేమ ఉంటుందో..అమ్మపై బిడ్డకు కూడా అంతే ప్రేమ ఉంటుంది. ఒక్క క్షణం తమ తల్లి కనిపించకపోతే పిల్లలు తల్లడిల్లిపోతారు. తాజాగా ఇలాంటి తల్లి, బిడ్డల ప్రేమకు సంబంధించిన వీడియో నెటిజన్ల గుండెలను పిండేస్తోంది.

తమిళనాడు కోయంబత్తూరులో బత్తిశ్వర ఆలయం సమీపం నుంచి వారం క్రితం తప్పిపోయిన తల్లి గుర్రం కోసం పిల్లగుర్రం వెతుకులాట ప్రారంభించింది. పేరూరు బస్ స్టేషన్ దగ్గర ఓ ప్రైవేట్ బస్సుపై తల్లి గుర్రంలాగే ఓ స్టిక్కర్ కనిపించడంతో బస్సుని అడ్డగించింది. బస్సుని వెంబడిస్తూ 3 కిలోమీటర్లు పరుగెత్తింది. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లికోసం ఆరాటపడుతున్న పిల్ల గుర్రం ఆవేదన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తల్లి కోసం ఆ బిడ్డ పడుతున్న తపన చూసి ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ పిల్ల గుర్రం తన తల్లి గుర్రం చెంతకు చేరాలని ఆకాంక్షిస్తున్నారు.

