NCCలో ఉన్నారా.. అయితే ఈ ఆర్మీ ఉద్యోగాలు చూడండి.
NCC సర్టిఫికెట్ ఉన్న విద్యార్థులకు కేంద్రం శుభవార్తనందిస్తోంది. NCC స్పెషల్ ఎంట్రీ పేరుతో ప్రత్యేక నోటిఫికేషన్లను ఇండియన్ ఆర్మీ ప్రతి సంవత్సరం విడుదల చేస్తోంది. ఈ ఉద్యోగాలకు అవివాహిత గ్రాడ్యుయేట్లు అర్హులు. మహిళలు కూడా దరకాస్తు చేయవచ్చు. ఇంటర్యూలో ప్రతిభ ఆధారంగా శిక్షణలోకి తీసుకుంటారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుంటే లెఫ్టినెంట్ హోదాతో విధుల్లో చేర్చుకుంటారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, వేతనాలు లభిస్తాయి.
ఏడాదికి ఒకసారే కాక రెండుసార్లు షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో కూడా స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. దక్షిణ భారతదేశానికి చెందిన వారికి బెంగళూరులో ఈ ఇంటర్యూలు ఉంటాయి. వీటిలో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. ఇవి రెండు దశల్లో జరుగుతాయి. స్టేజ్-1లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే స్టేజ్-2 ఇంటర్యూలో కొనసాగుతారు. తర్వాత వైద్యపరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.

ఇలా ఎంపికైన వారికి ఏప్రిల్, 2023 నుంచి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో 56 వేల పైచిలుకు స్టైఫండ్ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రధానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి 10 సంవత్సరాల పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. తర్వాత వారిని ఆసక్తిని బట్టి శాశ్వత ఉద్యోగంలో తీసుకుంటారు. వీరు 2 ఏళ్ల అనుభవం తర్వాత కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్లు కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదాలను పొందవచ్చు.

మొదటి నెలనుంచే ఈ ఉద్యోగంలో లక్ష రూపాయలకు పైగా వేతనం, ఇతర అలవెన్సులు పొందవచ్చు.
దీనికి ప్రవేశ అర్హత ఏమిటంటే ఏదైనా డిగ్రీలో 50 శాతానికి పైగా మార్కులు వచ్చి ఉండాలి. NCCలో C సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్ వచ్చి ఉండాలి. ఒకవేళ యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలయితే వారికి NCC సర్టిఫికెట్ అవసరం లేదు.
వయస్సు 2023, జనవరి 1 నాటికి 19 నుండి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల (సెప్టెంబరు ) 15 వరకు ఉంది.
మొత్తం 55 ఖాళీలు ఉన్నాయి. 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించబడ్డాయి.