కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు మృతి
జమ్మూ- కశ్మీర్‌లో తాజాగా మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్‌లోని పోష్క్‌రీరి ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతాబలగాలు తనిఖీలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడటంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బషరత్ నబీ, డానిష్ భట్ అనే ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు.

వీరిద్దరూ నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్నట్లు సమాచారం. 2021 ఏప్రిల్‌లో ఓ సైనికుడి హత్య కేసుతోపాటు, 2021 మేలో జబ్లీపురలో ఇద్దరు పౌరుల హత్య కేసులో వీరికి సంబంధం ఉందని కశ్మీర్ జోన్ ఏడీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇంకోవైపు శ్రీనర్‌లోని ఖాన్‌మోహ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు 30-35 కిలోల పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. కశ్మీర్ జోన్ పోలీసులు బాంబ్ స్కాడ్ బృందంతో వాటిని నాశనం చేయించనున్నట్లు అధికారులు వెల్లడించారు.