NationalNewsNews Alert

చివరికి మిగిలేదెవరు..? కాంగ్రెస్ విలాపం

గూడు చెదిరిపోతోంది. గుండె పగిలి పోతోంది. పునాదులు కదిలి పోతున్నాయి. వృద్ధ కాంగ్రెస్ ను ఒంటరి చేసి అంతా వెళ్ళి పోతున్నారు. పెంచి పెద్ద చేసి .. అందరినీ ఓ దారికి తెచ్చిన అమ్మ ను వదిలి వలస వెళ్ళి పోతున్నారు. ఎందుకిలా.. ? ఇంకా ఇక్కడ మిగిలింది ఏమీ లేదనా.. జవసత్వాలుడిగిన కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదనా.. ? ఇక ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదనా.. ? కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు. ఏవైనా కావచ్చు. కానీ.. అంతా వెళ్ళిపోవడం భావ్యమా..? ఇక్కడుండి అనుభవించింది ఏమీ లేదా.. నిన్న మొన్నటి వరకు నువ్వనుభవించిన పదవీ వైభోగం నీకెవరిచ్చారు. ముఖ్యమంత్రి పీఠంపై నిన్ను ఎక్కించింది ఎవరు.. ? ఇందిరాగాంధీ నుండి మన్మోహన్ సింగ్ వరకు కేంద్ర మంత్రిగా పదవిని వెలగ బెట్టావే.. ఆ స్ధితి కల్పించింది ఎవరు.. ? ఇప్పుడు వయసు మళ్ళిందనీ.. నాడీ వ్యవస్ధ దెబ్బతిన్నదని … ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని.. ఉన్న కొడుకు సరిగ్గా పట్టించుకోవడం లేదని .. ప్రాభవం తగ్గిందని .. బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని అబ్బో.. ఎన్నెన్నో అన్నారు. అసలు నీ వయసెంత..? నన్నొదిలి నువ్వు బయటికెళ్ళి ఏం చేద్దామని. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పుష్ప విలాపాన్ని తలపించే కాంగ్రెస్ విలాపం ఇది. తనను వదిలి వెళుతున్న వారిపై సంధిస్తున్న ప్రశ్నల శర పరంపర ఇది.

అదో పెద్ద కుటుంబం. ఒకప్పుడు అంతా కలిసి మెలసి ఉండేవారే. సమైక్యంగా నడిచి దేశంలో పెద్ద పేరు తెచ్చుకున్న వారే. ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన వారే. దేశాన్ని సమర్ధతతో నడిపిన వారే. స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం వహించింది. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడింది. ఎంతోమందిని కోల్పోయినా .. ధైర్యం చెదరకుండా నడక సాగించింది. స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని ఏలింది. ఎందరినో అక్కున చేర్చుకుంది. అందలాలెక్కించింది. వారే ఊహించనంత స్ధితిలో నిలిపింది. ఇవాళ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో… ఆయా పార్టీలలో ఎంత మంది నేతలున్నారో వారంతా .. ఒకప్పుడు ఆ పంచన పెరిగిన వారే. ఆ ఇంటి తిండి తిన్న వారే. అక్కడే ఓనమాలు దిద్ది పెరిగిన వారే. బుడిబుడి అడుగులతో .. ముద్దు ముద్దు మాటలతో మారాం చేసిన వారే. కొద్దిగా అనుభవం వచ్చిందో లేదో వేరు కుంపట్లు పెట్టుకుని కొందరు.. పక్కిళ్ళు బాగుంది కదా అని మరికొందరు.. ప్రలోభాలకు లోనై ఇంకొందరు చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్ళారు. ఇక్కడ వరకు అంతా ఓకే. వెళ్ళిన వాళ్ళు వెళ్ళకుండా తిన్నింటి వాసాలను లెక్కలు పెట్టడం ఏంటి. బయటకెళ్ళి నిన్ను పెంచి పెద్ద చేసిన వారినే విమర్శించడం ఏంటి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ను కన్నీరు పెట్టిస్తోంది. అసలే కష్ట కాలం. దానికి తోడు పక్క పార్టీలన్నీ పచ్చగా .. ఏపుగా ఎదుగుతున్నాయి. తానేమో ఎండి పోతోంది. నిన్న మొన్నటి వరకు చక్కగా పలకరించిన రాష్ట్రాలు కూడా ఇవాళ తనను చూడాగానే దబ్బున తల తిప్పేసుకుంటున్నాయి. అంతలా పాపం.. నేనేం చేశాను. అసలెందుకు నా మీద వీరందరికీ ఇంతలా కోపం.కసి. బాధతో తల్లడిల్లి పోతోంది కాంగ్రెస్.

తిట్టుకున్నా .. కొట్టుకున్నా అంతా కలిసే ఉన్నారు కదా అనుకున్నా.. కానీ.. ప్రతి దాన్నీ సీరియస్ గా తీసుకుని బయటకు వెళ్ళి పోతున్నారు. అప్పుడెప్పుడో జగజ్జీవన్ రామ్ అలాగే చేశాడు. బయటకెళ్ళి జే కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. కాసు బ్రహ్మానందరెడ్డి కూడా బయటకెళ్ళి రెడ్డి కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నాడు. చరణ్ సింగ్, దేవీలాల్, శిబూ సొరేన్, మమతా బెనర్జీ, దేవరాజ్ అర్స్, శరద్ పవార్, మర్రి చెన్నారెడ్డి ఇలా ఎంతో మంది కాంగ్రెస్ ను వీడి వెళ్ళి సొంత కుంపట్లు పెట్టుకున్న వారే. నిలబడ్డ వారు కొందరు. నిలబడలేక మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లో చేరిన వారు కొందరు. ఎందుకు వెళ్ళినా .. తిరిగి వస్తే ఆప్యాయతతో ఆదరించింది.. వారు కోరుకున్నది ఇచ్చింది. అన్ని రకాలుగా సమాదరించింది. కానీ .. మళ్ళీ మళ్ళీ అలాంటి పరిణామాలే ఎదురవుతున్నాయి. ఒకప్పుడు సలహాలిచ్చి ఓదార్చిన వారు ఉన్నారు. ఇప్పుడు సలహాలు లేవు, ఓదార్పులూ లేవు. చిన్నా చితకా నాయకులే అక్కడ అతి పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉంది. అయ్యో పాపం. అనే వాళ్ళే లేకుండా పోయారు. అదే.. బాధ, కాంగ్రెస్ గుండెను పట్టి పిండేస్తోంది.

దేశంలో ని అన్ని ప్రాంతాల్లో ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలన సాగించిన గత వైభవాన్ని తలచుకుని కుమిలి పోతోంది. ఇప్పుడెందుకు తనకీ స్ధితి. తనను ఈ దుస్థితికి తెచ్చిందెవరు..? తన బిడ్డలే తనను అనాధలు చేసి వెళ్ళి పోతున్నారే అని కన్నీరు పెడుతోంది. చూద్దామన్నా ఎక్కడా జెండాలు ఎగరడం లేదు. కాంగ్రెస్ కు జై అంటున్న వారు లేరు. పార్టీ కోసం నిలబడి.. కలబడే వారు లేరు. అంతా స్వార్ధం. దగా. మోసం. అవకాశం ఉన్నంతకాలం అంటి పెట్టుకు ఉండడం.. అవసరం తీరాక వదిలి వెళ్ళడం. ఇది న్యాయమా.. ధర్మమా..? అని ఆక్రోశిస్తోంది కాంగ్రెస్. ఇప్పుడూ అదే జరిగింది. నిన్న మొన్నటి వరకు పార్టీ వ్యవహారాలు అన్ని చెక్కబెడుతున్నాడు కదా అని ఆనందించింది. కానీ.. జీ23 అంటూ .. సొంతింట్లోనే శత్రు కూటమిని నడిపిన ఘనత ఆయనది. సరే.. తనకు బాధుంటే ఉందేమో .. నిన్న మొన్న వచ్చిన వారు కూడా అసంతృప్తిని వెళ్ళగక్కడమేంటి. ఇదేం విచిత్రం. వారందరినీ గ్రూప్ గా చేర్చి నువ్వు నాయకత్వం వహించడం అన్నది పెద్ద తప్పిదమే అంటూ రోదిస్తోంది కాంగ్రెస్. తెలుసుకుంటాడులే. తెలుసుకుని మసలు కుంటాడులే అనుకుంటే.. ఒక్కసారిగా పార్టీని వీడి వెళుతున్నట్లు ప్రకటించి మరీ ఇబ్బంది పెట్టాడు గులాంనబీ ఆజాద్. ఇదే .. ఇదే ఇప్పుడు తట్టుకోలేని బాధ కలిగిస్తోంది. మనసును ఎవరో మెలిపెట్టినట్టు అనిపిస్తోంది. గునపాలు గుచ్చినట్టుంది. ఇంటిని తగుల బెట్టి తమషా చూస్తున్నట్టుంది. ఇలా.. కాంగ్రెస్ పడే మనోవేదన అంతా ఇంతా కాదు.

కాంగ్రెస్ విలాపానికి అంతూ పొంతూ లేదు. ఎవరేం చేసినా చూస్తూ గమ్మున ఉండడమే ఈ పరిస్ధితికి కారణం. అధికారంలో ఉన్నప్పుడు ఉన్నది పోగేసుకుని చివరికి తనను భ్రష్టు పట్టించారని ఆవేదనా భరితమవుతోంది. జీ 23లో ఉన్న నేతలు కూడా ఇప్పుడు గులాంనబీ ఆజాద్ చేసిన పనిని ఎండగడుతున్నారు. అసలు మన ప్లాన్ ఇది కాదు కదా. ఎందుకిలా చేశావంటూ గులాంని నిలదీస్తున్నారు. ఆనంద్ శర్మ, సందీప్ దీక్షిత్, మనిష్ తివారీ ఇలా ఎంతో మంది మనస్ధాపంతోనే ఉన్నారు. కానీ.. వారెవరూ పార్టీని వదిలి వెళ్ళే ఆలోచన చెయ్య లేదు. మార్పును మాత్రం ఆశిస్తున్నారు. కానీ.. కపిల్ సిబాల్ వెళ్ళిపోయాడు. గులాంనబీ గడప దాటాడు. ఉన్న వాళ్ళందరినీ తీసుకు వెళ్ళే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇది ధర్మమా .. ? అంటూ కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తీవ్రంగా విలపిస్తోంది. ఎన్ని పాదయాత్రలు చేస్తే .. జరిగిన నష్టం పూడుతుంది. జనం తిరిగి జై కొడతారు. దీనికి తోడు పక్క పార్టీల ఎగతాళిని అసలు తట్టుకోలేక పోతోంది. కార్యకర్తలకు కష్టాలొస్తే నాయకులకు చెప్పుకుంటారు. నాయకులకే కష్టాలు వస్తే .. చెప్పుకోవడానికి ఎవరుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్ధితి అలానే ఉంది. ఈ విలాపం ఇంకెన్నాళ్ళు.. ? ఈ మనస్ధాపం వీడేదెన్నడు.. ? ఎవరో అవమానిస్తే తట్టుకోవచ్చు. తిరిగి సమాధానం ఇవ్వొచ్చు. నిన్నటి దాకా కలిసి మెలసి ఉండి ఇప్పుడు బయటకు వెళ్ళి రాళ్ళు విసరడం తట్టుకోలేని బాధే. పాపం. కాంగ్రెస్.