NationalNewsNews Alert

నాయకులారా.. జరా హుషార్..!


భజన చేయకున్న పరమాత్మ వరమీడు.. భజన నేర్వకున్న బ్రతుకు లేదు.. ప్రతిభ కన్నా నేడు భజనదే పైచేయి.. అన్నారు సాహిత్యకారులు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే తంతు. ఎక్కడకక్కడ చిడతలు వాయిస్తే కానీ పనులు కాని పరిస్ధితి. రాజకీయాలలో అయితే ఇది తీవ్ర స్ధాయిలో కొనసాగుతోంది. ఎవరి భజన వారిదే. ఎవరి కొలువు వారిదే. నిత్యార్చనలు. నిత్య పూజలు షరా మామూలే. ఆ దేవుడిని గురించి కూడా అంత చేటున భజన చేయరేమో. టెంకాయలు కొట్టడం తప్పించి అన్ని చేసేస్తున్నారు. ఇదో అలవాటుగా మారుతోంది. ఒహో.. రాజకీయాలలోకి వస్తే ఇలా చేయాలి కాబోలు అని భావి తరాల వారికి కూడా ఈ భక్తి మార్గాన్ని చూపిస్తున్న వారు ఎందరో. భజన చేసే విధము తెలియండి.. అంటూ కొత్త పల్లవులు నేర్పి స్వరాలు శృతి చేసే విధానాన్ని చక్కగా ఆచరించి చెబుతున్న వారు ఇంకెందరో. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలలో ఇప్పుడు ఇలాంటి వారి జోరు పెరుగుతోంది. వ్యక్తి పూజల జోష్ పెంచుతోంది.


భగవంతుడిని సేవించి తరించడానికి నవవిధ భక్తి మార్గాలను సూచించాయి పురాణాలు. అందులో శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ముఖ్యమైనవి. ఈ విధానాల ద్వారా ఆ దేవుడిని అర్చిస్తున్నారో లేదో తెలియదు కానీ.. రాజకీయ పరమాత్ములను సేవిస్తున్న వారి శాతం రోజురోజుకూ పెరుగుతూ ఉంది. స్వాతంత్య్రోద్యమ సమరంలో దేశమే దేహంగా భావించి .. సర్వం త్యాగం చేసిన వారిని భగవత్ స్వరూపులుగా ఆరాధించిన వారు ఉన్నారు. దేవాలయాలు లేని ఊళ్ళలో కూడా దేశభక్తుల విగ్రహాలు కనిపిస్తాయి. ఆ..ఆరాధనా భావం వేరు. వారి అకుంఠిత త్యాగ నిరతి వేరు. నిస్వార్ధ సేవా తత్పరత వేరు. అందుకే వారికంత గౌరవం , వారిని భజించడంలో ఓ అర్ధం పరమార్ధం ఉంది. కానీ.. ఇప్పుడు ఆ అర్దాలు మారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇదే అంశాన్ని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రస్తావించారు. వ్యక్తి పూజల వల్ల అన్ని రకాలుగా ప్రమాదమేని అన్నారు. గతంలో ఎప్పుడూలేని పద్ధతి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా కనిపిస్తోందని .. ఈ విధానం మారాలన్నారు.


కాంగ్రెస్ లో మాత్రం సెక్యులర్ భావాలు బాగా పెరిగి పోయాయి. నిన్న మొన్నటి వరకు విపరీతంగా భజన చేసిన వారు .. గాంధీల కుటుంబాలకు జై అన్న వారు ఇప్పుడు వారి నాయకత్వాన్ని నై అంటున్నారు. మార్పు రావాల్సిందే.. మార్పు జరగాల్సిందే అని పట్టుబడుతున్నారు. గాంధీల ద్వారా లాభ పడ్డ వారే ఇప్పుడు పార్టీ మనుగడపై మాట్లాడుతున్నారు. వాస్తవాలను, నిజాలను పక్కన పెడితే వారి నైజం ఎన్నిరకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చిందో ఆ పార్టీ నేతలంతా గమనిస్తూనే ఉన్నారు. ఇక హిందూ వ్యతిరేక భావజాలం బలంగా ఉన్న తమిళనాట కూడా అనేక రాజకీయ పార్టీలు నాస్తిక వాదాన్ని నూరి పోశాయి. కానీ.. ఆయా పార్టీల నాయకులకు మాత్రం వ్యక్తి పూజలు ఘనంగా జరిగేవి. కరుణానిధి, ఎంజీఆర్ లాంటి నేతల భజనలో తరించి.. పదవులు చేపట్టిన వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు బీహార్ లో లాలూకి ఉన్న భక్తజనం మరెవ్వరికీ ఉండరేమో అనుకునే వారు. సమోసామే ఆలూ హై.. బీహార్ మే లాలూ హై అంటూ కొలచిన నేతలూ ఉన్నారు. భక్తికి భక్తి లాభానికి లాభం. అలా ఎన్నో రకాలుగా లబ్ది పొందిన వారు ఉన్నారు. ఆయన చల్లని చూపుతో పైకెదిగిన నేతలూ ఉన్నారు.


ఇక 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికిన నేతగా ఎన్.టి. రామారావు సంచలనం సృష్టించారు. తెలుగుదేశం పార్టీని స్ధాపించి కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టారు. సినీ నటునిగా ఎన్నో పౌరాణిక పాత్రలు పోషించిన ఆయనను తెలుగు ప్రజలందరూ ఓ దైవంగానే భావించారు. రాష్ట్రం మొత్తం జై కొట్టి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టింది. తెలుగుదేశం హోరు గాలికి ఎంతో మంది పునాదులు కదిలి పోయాయి. అప్పటి దాకా ఉన్న కాంగ్రెస్ రాజకీయ చరిత్ర తుడిచి పెట్టుకు పోయింది. పార్టీ కార్యకర్తలు, నేతలు అంతా ఎన్టీఆర్ ను దేవుడుగా భావించి భజించారు. ఆ భజనలే ఒక రకంగా ఆయన పదవిని కూల్చాయి. వేరు కుంపటిని రాజేశాయి. భజనల్లో ఉన్న ఆంతర్యాన్ని గమనించక నష్ట పోయిన నేతగా రామారావును చెప్పుకోవాలి. ఇక అదే సమయంలో ఆయనపై అష్టోత్తర శతనామావళి రాసిన వారు కూడా ఉన్నారు. ఆ విపరీతమైన భక్తిని తట్టుకోలేక ఆయన వారందరికీ పదవులిచ్చేశారు.


ఇప్పుడైతే అన్నిపార్టీలలో భజన కేడర్ బలంగా ఉంది. ఎవరిని నమ్మాలో నమ్మ కూడదో కూడా అధినేతలే అంచనాలు కట్టలేక పోతున్నారు. వైసీపీలో అయితే ఈ కేడర్ బలిష్టంగా ఉంది. తెలుగుదేశం, జనసేనలో కూడా వీరి సంఖ్య గణనీయంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి వారిపైనే దృష్టి పెట్టినట్లు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చెప్పారు. వీరంతా భజన చేస్తూనే కోవర్టులుగా వ్యవహరిస్తున్నారన్నది ఆయన అనుమానం. పార్టీల కొంపలు ముంచే భజనలు వద్దని కేడర్ కు సందేశాలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి వారిని ఏరి పారేసే పనిలో కూడా ఆయన బిజీ అయ్యారు. దీనిని బట్టి భక్తి తో చేసే భజనల కన్నా .. అవకాశాల కోసం పొంచి ఉండి చేసే భజనలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు అటు నితిన్ గడ్కరీ.. ఇటు పవన్ కల్యాణ్ మాటల్లో వ్యక్త మవుతోంది. కాబట్టి నాయకులారా .. జరా హుషార్.