మునుగోడు గ్రౌండ్ రిపోర్ట్..
తెలంగాణ మలిదశ పోరాటానికి సిద్ధమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమం ఇప్పుడు ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని తపిస్తోంది. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే పోరాటం మొదలైంది. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు 2018లో అనూహ్య విజయాలతో సత్తా చాటింది. ఐతే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న చందంగా తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది. సీనియర్ రాజకీయ నేతలు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అసలైన ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ నమ్ముతున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2018లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఈ నెల 21న ఆయన బీజేపీలో లాంఛనంగా చేరబోతున్నారు.

బీజేపీలో చేరడానికి రెండు ప్రధాన కారణాలున్నాయంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఒకటి నియంతృత్వం, రెండు అసమర్థ నాయకత్వమేనని తేల్చిచెప్పారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి ఫ్యామిలీ.. కోమటిరెడ్డి ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్న పరిణామాలు… మారిపోయాయ్. కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులను తెగనమ్మి పనిచేసిన వారికి ఇప్పుడు గడ్డుకాలం ఎదురైంది. నాయకత్వం నుంచి గుర్తింపు లేక బ్రదర్స్… పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్ బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి పార్టీలో చేరతుండగా… మరో బ్రదర్ వెంకట్ రెడ్డిని పొమ్మనకుండా పొగబెట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ వచ్చిందో… ఆ లక్ష్యం నెరవేరడం లేదంటూ కొద్ది కాలంగా విద్యావంతులు, విద్యార్థులు భావిస్తున్నారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరనప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఏముందన్న ఆవేదనను కొన్ని వర్గాలు వ్యక్తమవుతోంది. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి, ఆశ్రితపక్షపాతం పీక్కు చేరాయంటూ మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి మృగ్యమైపోయిందని… కేవలం కొందరు కాంట్రాక్టర్లకు లబ్ధికలిగేలా పాలన ఉందంటూ ఆయన విమర్శించారు.

ఇలాంటి తరుణంలో కేసీఆర్కు బుద్ధి చెప్పాలని ప్రజాకాంక్షను మరోసారి తెలంగాణ సమాజానికి చూపించాలనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా ఆయన చెబుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వరకు బాగానే ఉన్నా… అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రతిపక్షాలను నిట్టనిలువునా చీల్చిన కేసీఆర్… అదే సూత్రంతో తెలంగాణాను సుదీర్ఘకాలం పాలించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రజలను కొంత కాలం మోసం చేయొచ్చు గానీ ఎల్లకాలం సాధ్యం కాదన్న రీతిలో ఇప్పుడు కేసీఆర్ సర్కారుపై తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు పోరుబాటపట్టారు. తెలంగాణలో పాలన మారాలంటూ నినదిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ తెలంగాణ ప్రజలకు ఆల్టర్నేటివ్గా కన్పిస్తోంది. దుబ్బాకలో మొదలైన బీజేపీ జైత్ర యాత్ర గ్రేటర్ ఎన్నికల మీదుగా హుజూరాబాద్ చేధించి… ఇప్పుడు మునుగోడు గడ్డపై అడుగుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇటీవలే జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కుటుంబ పాలన పోవాలంటే, అవినీతి అంతం కావాలంటే బీజేపీని ఆదరించాలని ప్రధానితోసహా, అగ్రనాయకత్వం అంతా పిలుపునిచ్చింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియడం…రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం… చకచకా జరిగిపోయాయ్. మునుగోడులో గత వారం, పది రోజులుగా జరుగుతున్న రాజకీయం చూసిన వారెవరికైనా ఫుల్ క్లారిటీ వస్తోంది. మునుగోడుకు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల మునుగోడుకు రోడ్లు వస్తున్నాయని, ఇన్నాళ్లూ రాని పింఛన్లు వస్తున్నాయని, గట్టుప్పల్ మండలం ఏర్పాటవుతోందని… ఇంకా ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ అందుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణలో అభివృద్ధి ఎలా సాధ్యమన్నదానిపై ప్రజల్లో ఫుల్ క్లారిటీ వస్తోందనడానికి ఇదే నిదర్శనంగా భావించాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని సకల జనులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే మునుగోడు తరహా అభివృద్ధికి పలువురు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టుగా కన్పిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందా… అన్న ఎజెండా ఇప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది.

