ప్రజాభవన్‌ను ముట్టడించిన విద్యార్థులు
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వామపక్ష విద్యార్థి సంఘాల బంద్‌లో భాగంగా నిర్వహించిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. నిరసనకారులు ప్రజాభవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రైవేటు విద్యాసంస్థల్లో పెరుగుతున్న ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బకాయిల సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఆందోళనతో ప్రజాభవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో కొంతసేపు ప్రజాభవన్ పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

