BusinessHome Page SliderNationalNews

మారుమూల ప్రాంతాలకు బీఎస్ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్) అత్యాధునిక శాటిలైట్ ఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, నావికా రంగాలతో పాటు ప్రకృతి విపత్తులు, మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో నిరంతర కమ్యూనికేషన్ కోసం ఈ సేవలను ప్రారంభించింది. అన్ని పన్నులతో కలిపి ఈ శాటిలైట్ ఫోన్ ధరను రూ.1,34,166గా నిర్ణయించింది. గ్లోబల్ శాటిలైట్ ఫోన్ సర్వీస్ (GSPS) ద్వారా నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు వినియోగించుకోవచ్చు. గనులు, సముద్ర ప్రాంతాలు, అడ్వెంచర్ ట్రావెల్ వంటి ప్రాంతాల్లో పనిచేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీఎస్ఎన్‌ఎల్ తెలిపింది.

ఈ సేవలను వినియోగించాలనుకునే వారు ఫోన్‌ను ఎక్కడ, ఎంతకాలం, ఏ అవసరం కోసం ఉపయోగిస్తారో ముందుగానే బీఎస్ఎన్‌ఎల్‌కు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బీఎస్ఎన్‌ఎల్ రెండు రకాల ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ప్రభుత్వ, వాణిజ్య సంస్థలకు నెలకు రూ.3,500, రూ.5,835, రూ.11,670 అద్దెతో 16, 30, 60 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ లేదా ఎస్ఎంఎస్ సౌకర్యం లభిస్తుంది.

ప్రీపెయిడ్ విభాగంలో ప్రభుత్వ సంస్థలకు నెలకు రూ.3,500 లేదా ఏడాదికి రూ.38,500 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వాణిజ్య సంస్థలకు నెలవారీ ప్లాన్ రూ.5,835, వార్షిక ప్లాన్ రూ.64,185గా నిర్ణయించారు. ఉచిత నిమిషాల పరిమితి ముగిసిన తర్వాత ప్రభుత్వ సంస్థలకు నిమిషానికి లేదా ఒక్కో ఎస్ఎంఎస్‌కు రూ.18, వాణిజ్య సంస్థలకు రూ.25 చొప్పున ఛార్జీలను వసూలు చేస్తారు. అదనపు వినియోగం కోసం రూ.200 నుంచి రూ.10,000 వరకు వివిధ రీఛార్జ్ ఓచర్లను కూడా బీఎస్ఎన్‌ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సమీప బీఎస్ఎన్‌ఎల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సంస్థ సూచించింది.