వందలాది చిన్నారులు మృతి: యూనిసెఫ్ ఆందోళన
అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ భీకర పోరాటంతో చిన్నారుల పాలిట శాపంగా మారింది. గత నెల 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఏడవ రోజుకు చేరుకోగా, వందలాది మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఐక్యరాజ్యసమితి విభాగం యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధాలను పిల్లలు ప్రారంభించకపోయినా, వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని యూనిసెఫ్ ఆసహానం వ్యక్తం చేసింది.
ఈ ఏడు రోజుల యుద్ధంలో ఇప్పటివరకు మొత్తం 192 మంది చిన్నారులు మృతి చెందినట్లు యూనిసెఫ్ గణాంకాలను వెల్లడించింది. వీరిలో అత్యధికంగా ఇరాన్‌లో 181 మంది ప్రాణాలు కోల్పోగా, లెబనాన్‌లో ఏడుగురు, ఇజ్రాయెల్‌లో ముగ్గురు , కువైట్‌లో ఒకరు బలయ్యారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 160 మంది విద్యార్థినులు మృతి చెందడం అత్యంత విషాదకరం.
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది మంది పిల్లలు విద్యకు దూరం కావడమే కాకుండా తీవ్రమైన మానసిక ఆందోళనలకు లోనవుతున్నారు. సైనిక ఉద్రిక్తతలు చిన్నారుల ఆరోగ్యం, సంక్షేమంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ హెచ్చరించింది. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, చిన్నారుల ప్రాణాలను కాపాడాలని అంతర్జాతీయ సమాజానికి యూనిసెఫ్ విజ్ఞప్తి చేస్తోంది.

