కానిస్టేబుల్ సౌమ్య ధైర్యానికి సెల్యూట్
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ , గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో జరిగిన ఈ దాడి అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య చికిత్సకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని, ఆమె సంపూర్ణంగా కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సౌమ్య ఉద్యోగంపైనే ఆమె కుటుంబం ఆధారపడి ఉందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,354 కేసుల్లో 2,457 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 5,196 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి ముఠాలను అడ్డుకోవడంలో సౌమ్య చూపిన తెగువను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

