Breaking Newshome page sliderHome Page SliderTelangana

గ్రూప్‌-1 నియామకాలపై తీర్పు వాయిదా

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే కీలక తీర్పుపై ఉత్కంఠ మరికొన్ని రోజులు కొనసాగనుంది. గ్రూప్-1 నియామకాలకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై తీర్పును తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. తీర్పు కాపీ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడమే ఇందుకు కారణమని న్యాయవాదులకు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.గతంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, మార్కుల తుది జాబితాను, జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. జవాబుపత్రాలను పునర్‌ మూల్యాంకనంచేయాలని, లేనిపక్షంలో తాజాగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు, ఇప్పటికే ఎంపికైన పలువురు అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ధర్మాసనం, గతంలోనే వాదనలు పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. నియామక ప్రక్రియపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూనే.. అపాయింట్‌మెంట్లు అన్నీ కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.ఈ అప్పీళ్లపై గురువారం తీర్పు వెలువడుతుందని అభ్యర్థులందరూ ఆశగా ఎదురుచూశారు. అయితే తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో న్యాయస్థానం మరో రెండు వారాల పాటు గడువు పొడిగించింది. దీంతో ఫిబ్రవరి 5న వచ్చే తీర్పు గ్రూప్-1 పోస్టుల భవితవ్యాన్ని ఏ తీరానికి చేరుస్తుందోనన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.