BusinessHome Page SliderNationalNews Alert

అదరగొట్టిన బంగారం బాండ్లు..లక్షకు నాలుగున్నర లక్షలు

ఇంటర్నెట్ డెస్క్: బంగారం బాండ్లు కొనుగోలు దారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4 న జారీ చేసిన తుది రిడెంప్షన్ ధరను ఆర్బీఐ గురువారం ప్రకటించింది. అప్పుడు జారీ చేసిన బాండ్లు అదరగొట్టే ప్రతిఫలాలు అందిస్తున్నాయి. లక్ష రూపాయలు మదుపు చేసిన వారికి ఏకంగా నాలుగున్నర లక్షలు రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అప్పట్లో గ్రాము బంగారం ధర రూ.2,961 కాగా, ఇప్పుడు 8 ఏళ్లు పూర్తి కావడంతో మెచ్యూరిటీకి వచ్చాయి. ఇప్పుడు ఈ ధర రూ. 12,820 గా నిర్ణయించింది. అంటే ఒక గ్రాముపై ఏకంగా రూ.9901 ప్రతిఫలం వచ్చింది. దీనికి ఏటా చెల్లించే వడ్డీ 2.5 శాతం అదనం కావడంతో ఈ మొత్తం ఇంకా పెరిగుతుంది. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించే ఉద్దేశంతో 2015 నవంబర్ లో కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకం కాలపరిమితి 8 ఏళ్లు. ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేసే ఈ బాండ్లు ఖజానాకు భారం కావడంతో గతేడాది ఈ బాండ్ల జారీని నిలిపివేశారు. అయితే ఈ బాండ్లు కొనుగోలు చేసినవారికి బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో చాలా లాభాలు వస్తున్నాయి.