BC రిజర్వేషన్లపై కీలక చర్చ – సీఎం రేవంత్ సర్కార్‌లో తుది నిర్ణయం దిశగా!
హైదరాబాద్: BC రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై కీలక ప్రతిపాదనలపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సమావేశంలో మెజార్టీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి, స్థానిక ఎన్నికల్లో BCలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ స్థాయిలోనే ఈ నిర్ణయాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దాంతో BC వర్గాల మద్దతు మరింతగా పెరుగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం ఈ నెల 19న TPCC పీఏసీ (పాలిటికల్ అఫైర్స్ కమిటీ) సమావేశంలో తీసుకోనున్నారు. అనంతరం అక్టోబర్ 23న జరగనున్న తదుపరి క్యాబినెట్ భేటీలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.