చైనా మహిళతో ప్రేమ .. దౌత్యవేత్తకు యూఎస్ షాక్
చైనా మహిళతో రహస్యంగా ప్రేమ సంబంధం కొనసాగించిన అమెరికా దౌత్యవేత్తపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ చైనా మహిళతో సంబంధాన్ని దాచిపెట్టినందుకు ఆయనను పదవి నుంచి తొలగించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా ఉద్యోగులు విదేశీ వ్యక్తులతో, ముఖ్యంగా చైనా, రష్యా వంటి దేశాల పౌరులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం జాతీయ భద్రతకు ప్రమాదకరమని అమెరికా చాలా కాలంగా హెచ్చరిస్తోంది. 1987లోనే చైనాలో, సోవియట్ రష్యాలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న కాంట్రాక్టర్లకు ఈ విషయంలో నిషేధం విధించింది.
దౌత్యవేత్త సంబంధం ఉన్న చైనా మహిళపై గూఢచర్యం ఆరోపణలు రావడంతో విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది. ఆయన ఈ సంబంధాన్ని అధికారికంగా వెల్లడించకుండా దాచినట్టు స్పష్టమైన నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు.
అమెరికా ప్రభుత్వం జాతీయ భద్రతపై ఎటువంటి రిస్క్ తీసుకోదని, ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఎవరినైనా వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఈ దౌత్యవేత్త పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.