Breaking Newshome page sliderHome Page SliderNationalNewsPoliticsviral

పరుగులు పెడుతున్న పసిడి ధరలు

బంగారం ధర రోజురోజుకీ పైపైకి పరుగులు పెడుతూ సామాన్యులకి అందని ద్రాక్షలా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కలిసి బంగారానికి డిమాండ్ పెంచేశాయి. తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ ఇంకా కొనసాగుతుండడంతో బంగారం ధరకు పట్టపగ్గాల్లేకుండా పోయింది. దీంతో అంతర్జాతీయ విపణిలో ఔన్సు ధర 4 వేల డాలర్ల దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగా పసిడి ధర సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం అంటే 31.10 గ్రాముల బంగారం ధర సోమవారానికి 3935 డాలర్లకు చేరింది. డాలర్ విలువ రూ. 88. 79 కి చేరడంతో దీని ధర ఎక్కువగా ఉంది. ఈ ధరలను అనుసరించి హైదరాబాద్ లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,420కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,700 పలుకుతోంది. అటు కిలో వెండి ధర కూడా రూ. లక్షన్నర దాటింది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి సుమారు రూ.1.54 లక్షలుగా ఉందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం కొనేందుకు వెనకాడుతున్నారు. దీంతో క్రయవిక్రయాలు చాలా వరకు తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర ఆభరణాల వైపు మగువలు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు.
ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందదన్న అంచనాలు, డాలర్ ఇండెక్స్ క్షీణించడం, అమెరికా బాండ్ల రాబడి పడిపోవడం వంటివి ఇప్పటికే బంగారానికి డిమాండ్ పెంచాయి. మరోవైపు భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల వల్ల రిజర్వ్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకుంటూ పోతున్నాయి.