Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

కాలుష్యకోరల్లో మూసీ… కాపాడేవారే లేరా ?

హైదరాబాద్ చరిత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ కోట, నిజాముల శకమే కాదు… మూసీ నది కూడా. వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన ఈ ముచికుందా, నేడు మూసీగా పిలువబడుతుంది . ఈ మూసీ నది నల్లగొండ వడపల్లి దగ్గర కృష్ణలో కలుస్తుంది. ఒకప్పుడు నిండుగా పారుతూ వేల ఎకరాల పంటలను సాగు చేసేది. పడవలు తిరిగేంతగా నీరు ఉండేది. మత్స్యకారులకు జీవనాధారం అయ్యేది. కాని, నేటి పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.

చరిత్రకెక్కిన మూసీ
మూసీ నది ప్రవాహమే హైదరాబాద్ పుట్టుకకు కారణమైంది. 1578లో రాకుమారుడు కులీ కుతుబ్ షా తరచూ భాగమతిని కలిసేందుకు ఈ నది దాటేవాడు. అలా నిర్మించబడింది తొలి వంతెన – పురానాపూల్. 1590లో మూసీ ఒడ్డునే భాగ్ నగర్ అనే కొత్త నగరం ఆవిర్భవించింది. అదే తర్వాత హైదరాబాద్‌గా మారింది.

మూసీ ఉగ్రరూపం
1631లోనే తొలిసారి వరదలతో నగరం దెబ్బతింది. 1677లో శివాజీ మహారాజు ఈ వంతెన దాటి శ్రీశైలం వెళ్లారు. 1831లో ఏనుగుల వీరాస్వామయ్య తన “కాశీయాత్ర చరిత్ర”లో మూసీ ఉగ్రరూపాన్ని లిఖించారు. కానీ, అత్యంత విషాదం మాత్రం 1908లో జరిగింది. ఆ వరదల్లో మూడవ వంతు హైదరాబాద్ మునిగిపోయింది. 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దృశ్యాన్ని చూసి కదిలిన నిజాం మహబూబ్ అలీఖాన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనకట్టల నిర్మాణం జరిపించారు. నగర రక్షణకు పెద్ద గోడలు కూడా నిర్మించారు.ప్రస్తుతం అదే స్థాయిలో మూసీకి వరద వచ్చింది . నగరంలో చాల చోట్ల ఇళ్ళు మునిగిపోయాయి , వాహనాలు కొట్టుకుపోయాయి .రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి . గతాన్ని గుర్తుచేస్తూ నగరంలో చాల ప్రాంతాలను మూసీనది ముంచెత్తింది . ప్రస్తుత ప్రభుత్వం సహాయక చర్యల్లో మునిగిపోగా , ప్రతిపక్షాలు మాత్రం ముమ్మాటికీ ఇది ప్రభుత్వ వైఫల్యమే అంటూ విమర్శలు చేస్తున్నాయి . మూసీ ఉగ్రరూపాన్ని చాల ఏళ్ళ తరువాత హైదరాబాద్ నగరం చూసింది . సీఎం రేవంత్ పదే పదే మూసీ ప్రక్షాళన చేస్తామనడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి .

మురికినదిగా మారిన మూసీ
ఒకప్పుడు పంటలకు ప్రాణం పోసిన ఈ నది, నేడు కాలుష్యానికి ప్రతీకగా మారింది. గత 50 ఏళ్లలో మూసీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. కాలుష్యం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. సూర్యాపేట వద్ద ఉన్న మూసీ ప్రాజెక్టుకూ ఇది పాకింది. మూసీ చెట్టు పెరిగిన భూకబ్జాలే కాలుష్యానికి , వరదలకు కారణం అంటున్నారు విశ్లేషకులు . ప్రభుత్వాలు మారుతున్నాయి ,నాయకులూ మారుతున్నారు కానీ , హైదరాబాద్ కు వరద కష్టాలు మాత్రం తీరడం లేదు . ప్రజలు మారరు వాళ్ళు ఇబ్బందులు వస్తే ప్రశ్నిస్తారు అంతే కాబట్టి నాయకులు రంగంలోకి దిగి కాలుష్యాన్ని అరికట్టాలి , నిజంగా మూసీ ప్రక్షాళన చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి అంటే ప్రభుత్వాలు , ప్రతిపక్షాలు కలిసి సమస్యను పరిష్కరించే ఆలోచన చేయాలి . భావి పౌరులకు మంచి చేయాలనుకుంటే ఇప్పటి ప్రభుత్వం , ప్రతిపక్షాలు ఈ వరదల విషయంలో వ్యూహాలు రచించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి .

మూసీకి మళ్లీ వైభవం వస్తుందా?
ప్రతి రోజూ ఈ నదిని దాటే ప్రతి ఒకరి మనసులో ఒకే ప్రశ్న మెదులుతుంది అదే —మూసీకి మళ్లీ పూర్వ గౌరవం వస్తుందా? భారీ వర్షాలప్పుడు ఆనకట్టల గేట్లు తెరిచినప్పుడే దీన్ని నిండుగా చూడాలా? లేక ప్రతిరోజూ సుందర నదీ తీరంలా మార్చగలమా ,? అని భాగ్యనగరంపై ప్రేమ ఉన్న అందరు తమలో తాము మదన పడుతున్నారు .
గుజరాత్‌లో శబరిమతి, దేశంలో గంగానదిని ప్రక్షాళన చేసినట్టే సంకల్పం ఉంటే మూసీని కూడా మళ్లీ జీవంతో నింపవచ్చు. సమస్య వనరుల లోపం కాదు, సంకల్పం లోపం. నాయకులు నిజంగా ముందుకొస్తే, మూసీ మళ్లీ ఒకసారి నగర గుండె చప్పుడు అవుతుంది.