Breaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertTelanganaviral

సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్‌ను బోగస్ చేశారు

కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చే దసరా బోనస్‌ను కూడా బోగస్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి తీవ్ర నిరాశ కలిగించిందని ఆరోపించారు. మొత్తం లాభం రూ.6,394 కోట్ల నుంచి కాకుండా, రూ.2,360 కోట్ల నుంచి బోనస్ చెల్లించడం దారుణమన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారని తెలిపారు. గతేడాది కూడా ఇదే విధంగా మోసం చేసి, బోనస్‌లో 50% వాటా కోత విధించారని గుర్తు చేశారు. సంస్థ గడించిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్‌ను కూడా బోగస్ చేశారని ఆరోపించారు.

ఎంతో శ్రమించి సంస్థకు మంచి లాభాలు చూపించినందుకు డబుల్ వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం అడియాశలు చేసిందన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారని, కాంగ్రెస్ మాత్రం వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గమన్నారు. గతేడాది సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కన పెట్టిన రూ.2,283 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి అని, ఇప్పుడు రూ.4,034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే కార్మికుల జీవితాల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, నికర లాభంలో 34 శాతం బోనస్‌గా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు.