Breaking Newshome page sliderHome Page SliderNationalNewsviral

అలారం శబ్దంతో హార్ట్ ఎటాక్ వస్తుందా…!

మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ చేసిన తాజా అధ్యయనం ఆశ్చర్యకర అంశాలను వెల్లడించింది. పొద్దున్నే వినిపించే అలారం మోత గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే ముప్పును పెంచుతుందని పేర్కొంది. కొందరిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్రలేవమని మొదటిరోజు పరిశోధకులు వారికి సూచించారు. రెండోరోజు మరి కొందరికి అలారం పెట్టుకొని లేవమని చెప్పారు. ఈ రెండు ఫలితాలను పరిశీలించగా.. బలవంతంగా అలారం సౌండ్ కి లేచిన వారికి సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించారు. అలారం శబ్దం (Alarm Sound) మన శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుంది. ఆ స్పందన కారణంగా కార్టిసోల్‌, అడ్రినలిన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్లు గుండె వేగాన్ని పెంచుతాయి. రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయి. అవి బీపీని పెంచేందుకు కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. నిద్రలేవగానే ఇలా బీపీ పెరగడాన్ని మార్నింగ్ బ్లడ్‌ ప్రెజర్ సర్జ్ అని పిలుస్తారు. నిద్రసరిపోనప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉదయం పూట అలారంతో బీపీ పెరగడం తాత్కాలికమే అయితే ప్రమాదం లేదు కానీ.. కానీ తరచూ అదే పరిస్థితి ఎదురయితే.. మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారికి ప్రమాదకరమని వెల్లడించారు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం ద్వారా అలారాన్ని దూరంగా ఉంచొచ్చు. ఆవలింతలు, అలసట వంటి శరీరం ఇచ్చే సిగ్నళ్లను గుర్తించి నిద్రకు ఉపక్రమించేలా చూసుకోవాలి. వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెడ్‌పైన పడే లైటింగ్ సహజంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.