ధర్మస్థల కేసులో కొత్త పరిణామాలు
ధర్మస్థలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మృతదేహాల గోప్యతా వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. 1998 నుండి 2014 వరకు 100లకు పైగా మృతదేహాలు సమాధులలో పడిపోయాయని ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టింది.
SIT అదుపులోకి తీసుకున్న మాజీ శానిటేషన్ కార్మికుడు భీమ ఇచ్చిన సమాచారం ఆధారంగా తవ్వకాలు జరిపారు. అయితే, ఆ తవ్వకాల ద్వారా కేవలం కొన్ని ఎముకలు మాత్రమే బయటపడ్డాయి. భీమ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించాడని తేల్చిన SIT, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది.
ఇక బెంగళూరునుండి వచ్చిన సుజాత అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదులో నిజమెంత అని విచారణ జరిపిన అధికారులు, ఆమె స్వయంగా ఆ ఫిర్యాదు అబద్ధమని అంగీకరించడంతో, ఆమెపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఈ రెండు ఘటనలపై సమగ్ర విచారణ చేసిన SIT బృందం, ఈ ఇద్దరు వ్యక్తులు ప్రజల మనసులను తప్పుదారి పట్టించే విధంగా ప్రవర్తించారని తేల్చింది. తుది నివేదిక ఆధారంగా, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.