కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే యాక్సియం – 4 మిషన్ విజయం కావడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు సురక్షితంగా వెళ్లి వచ్చిన భారతీయ వ్యోమగామి శుక్లాను అభినందించింది. దేశంలో రైతుల అభ్యున్నతి కోసం కేంద్రం ప్రాధాన్యత ఇస్తునట్లు తెలిపింది. అందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ దన్ ధ్యాన్ క్రిష్ యోజన కోసం ఏడాదికి రూ. 24 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే ఈ పథకం కింద 100 జిల్లాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టనున్నారు. పునరుత్పాదక శక్తిలో పెట్టుబడి పెట్టడంతోపాటు జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంస్థను బలోపేతం చేయాలని కూడా నిర్ణయించింది. అలాగే ఎన్టీపీసీ అనుబంధ సంస్థ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపింది. ఎన్టీపీసీ ఈక్విటీ ఇన్ఫ్యూషన్ రూపంలో ఎన్జీఈఎల్లో ఇప్పటి వరకు రూ. 7,500 పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. ఇక ఎన్జీఈఎల్లో రూ. 20 వేల కోట్ల పెట్టుబడికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.