గుంటూరు మిర్చి ఘాటుకు జాతీయ అవార్డు
అమరావతి : ఒక జిల్లా-ఒక ఉత్పత్తి (ODOP) కార్యక్రమంలో గుంటూరు మిరపకు జాతీయ స్థాయిలో బంగారు కేటగిరిలో మొదటి బహుమతి లభించింది. న్యూఢిల్లీ ప్రగతి భవన్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ స్వీకరించారు. జిల్లా తరఫున గౌరవంగా భావిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ తరపున రాష్ట్ర మంత్రి సవిత, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మిరప. ఈ మిర్చికి ఘాటు ఎక్కువ. ఇక్కడి భూములు, సాగు విధానాలు, వాతావరణం వల్ల ఇతర ప్రాంతాల్లో పండే మిర్చితో పోలిస్తే దీనికి ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుంటూరు మిర్చి ఘాటుకు మంచి స్పందన ఉంటుంది. గుంటూరులో విత్తనం మొదలుకుని ఎగుమతుల వరకు అన్ని దశల్లోనూ ఈ మిర్చికి ప్రత్యేకతలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల రైతులు సైతం ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఆసియాలో అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డు గుంటూరులోనే ఉంది. గిట్టుబాటు ధర దక్కేలా 80కి పైగా శీతల గోదాములు రైతులకు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగంలో మొత్తం 29 అవార్డులు ప్రకటించాయి. అందులో ఏకంగా రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 అవార్డులను సాధించింది.


 
							 
							