అగ్రకులాల నేతలు… బీసీలపై దాడి చేస్తున్నారు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అగ్రకులాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. అగ్ర కులాల నేతలు బీసీలపై దాడికి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. పీర్జాదిగూడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, బీసీలంతా కలిసి ఒక రాజకీయ పార్టీగా మారి భవిష్యత్తులో అధికారాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. తనపై జరిగిన హత్యాయత్నం వెనుక కల్వకుంట్ల కవిత ఉండి ఉంటారని ఆరోపిస్తూ, ఆమె బంధువు సుజిత్ రావు తన కార్యాలయంపై దాడికి పాల్పడ్డాడని తెలిపారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. జాగృతి నేతల దాడిని బీఆర్‌ఎస్ నేతలు కూడా వ్యతిరేకించారని, కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కవితకు అండగా నిలిచారంటూ విమర్శలు గుప్పించారు. కవిత త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఇప్పటికే ఆమెకు ఆ పార్టీతో అనధికారిక ఒప్పందం జరిగినట్లు ఆరోపించారు. తనపై మూడుసార్లు హత్యాయత్నాలు జరిగాయని, మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి చీకటి ఒప్పందాలతో పనిచేస్తున్నాడని తెలిపారు. తాము న్యాయం పొందకపోతే రెండు కోట్ల బీసీలతో రోడ్డెక్కి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు, మున్నూరు కాపు సంఘాల ఐక్యవేదిక తీన్మార్ మల్లన్నకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా, క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి ఘటనలో ఆయన గన్‌మెన్ శ్రీనివాస్‌పై శాఖాపరమైన చర్యలు తీస్తూ అతన్ని హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేసినట్లు సమాచారం.