ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా
మాంచెస్టర్: భారత మహిళా క్రికెటర్లు ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించారు. అదిరిపోయే ఫామ్ లో ఉన్న టీమిండియా వుమెన్స్ జట్టు టీ20లో ఇంగ్లండ్ పై తొలిసారి సిరీస్ విజయాన్ని అందుకుంది. బుధవారం నాలుగో టీ20లో ఆరు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. 2006లో డెర్బీలో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత్ పైచేయి సాధించింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇంటా, బయటా కూడా ఇంగ్లాండ్ పై భారత్ సిరీస్ నెగ్గలేకపోయింది. ప్రస్తుత పర్యటనలో బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా సత్తాచాటడంతో అలవోకగా సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. భారత బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ సోఫియా డంక్లీ (22; 19 బంతుల్లో 2×4, 1×6) టాప్ స్కోరర్. సిరీస్ లో భారత విజయాల్లో కీలకంగా మారిన తెలుగమ్మాయి శ్రీచరణి (2/30) మరోసారి విజృంభించింది. రాధ యాదవ్ (2/15), అమన్ జ్యోత్ కౌర్ (1/20), దీప్తిశర్మ (1/29) కూడా సత్తాచాటడంతో ఇంగ్లాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం భారత్ 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్మృతి మంధానా (32; 31 బంతుల్లో 5×4), షెఫాలీ వర్మ (31; 19 బంతుల్లో 6×4), జెమీమా రోడ్రిగ్స్ (24 నాటౌట్; 22 బంతుల్లో 1×4), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (26; 25 బంతుల్లో 3×4) రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. సిరీస్ లో ఆఖరి టీ20 శనివారం జరుగుతుంది.

