Home Page SliderNews AlertSportsviral

‘క్యాచ్ లు డ్రాప్ అయ్యాయని ఏడుస్తూ కూర్చోవాలా’.. బుమ్రా

టీమిండియా (Team India) స్టార్ బౌలర్ జస్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇంగ్లాండ్ తో మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ మాటలతో అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అతడు ఈ సిరీస్ లో మూడు కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా తొలి ఇన్నింగ్స్ 83 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. మిగతా బౌలర్లు మాత్రం మరో 5 వికెట్లు తీయడానికి 382 పరుగులు సమర్పించుకున్నారు. తన అద్భుత ప్రదర్శన అనంతరం బుమ్రా మాట్లాడిన వీడియోను బీసీసీఐ (BCCI) తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంగ్లండ్ వాతావరణం బాగుందంటూ అతడు అందులో అన్నాడు. ‘ఇది చాలా బాగుంది. భారత్లో కన్నా ఇక్కడ కాస్త చల్లగా ఉంది. నేను ఉత్సాహంగా ఉన్నాను. కాబట్టి మంచి విషయాలు జరుగుతాయి అని ఆశిస్తున్నా’ అని బుమ్రా మాట్లాడాడు. దీంతో ఈ సిరీస్ లో బుమ్రా మొదట అనుకున్న మూడు కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశముందని అభిమానులు ఓ అంచనాకు వస్తున్నారు. ‘ఇక్కడ వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఫీల్డర్లు క్యాచ్లు అందుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు’ అని బుమ్రా చలి వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించాడు. లీడ్స్ ని హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్ జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డర్లు పలు క్యాచ్ లు డ్రాప్ చేశారు. దీనిపై కూడా బుమ్రా స్పందించాడు. ‘క్యాచ్ లు డ్రాప్ అయ్యాయని ఏడుస్తూ కూర్చోలేం కదా! అక్కడే ఆగిపోకుండా.. ఆటలో ముందుకుసాగిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాలో చాలామంది కొత్తగా జట్టులోకి వచ్చారు. కాబట్టి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. కావాలని ఎవరూ క్యాచ్ లు డ్రాప్ చేయరు కదా! క్రికెట్లో ఇలాంటివి సహజం. వాటి నుంచి వారు నేర్చుకుంటారు. నేను బాధతో బంతిని తన్ని లేదా ఆగ్రహం వ్యక్తం చేసి వారి మీద మరింతగా ఒత్తిడి పెంచాలనుకోవడం లేదు’ అని బుమ్రా భారత ఫీల్డర్లకు మద్దతుగా నిలిచాడు.