News Alert

ఈపీఎఫ్‌వోలోకి 18.36 లక్షల కొత్త సభ్యులు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రతా పథకంలోకి జూన్‌ నెలలో కొత్తగా 18.36 లక్షల మంది సభ్యులు చేరారు. గత ఏడాది జూన్‌ నెలలో కొత్త సభ్యులు 12.83 లక్షలతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఇందుకు సంబంధించి పేరోల్‌ గణాంకాలను కార్మిక శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా జూన్‌లో 9.21 శాతం వృద్ధి కనిపిస్తోంది.

ఇక జూన్‌ నెలలో కొత్త సభ్యులు 18.36 లక్షల మందిలో 10.54 లక్షల మంది ఈపీఎఫ్‌ అండ్‌ ఎంపీ యాక్ట్, 1952 కింద మొదటసారి చేరిన వారు ఉన్నారు. ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం వల్ల 7.82 లక్షల మంది కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా కొత్త సభ్యుల్లో పెరుగుదల కనిపిస్తోంది. 22–25 వయసు నుంచి 4.72 లక్షల మంది కొత్తగా చేరారు. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాష్ట్రాల నుంచే 12.61 లక్షల మంది కొత్తగా చేరిన వారున్నారు. మొత్తం కొత్త సభ్యుల్లో మహిళలు 4.06 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల్లో మహిళల శాతం మే చివరికి 20.37 శాతంగా ఉండగా, జూన్‌ చివరికి 22.09 శాతానికి తగ్గింది.