తెలంగాణాలో 15 రోజులు.. ఏపీలో 4 రోజులు
నిర్వీర్యమవుతున్న కాంగ్రెస్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ జరిపే ఈ యాత్ర తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగనుంది. ఈ పాదయాత్ర రూట్ మ్యాప్ దాదాపు ఖరారైంది. అక్టోబర్ 24వ తేదీన కర్ణాటకలోని రాయచూర్ నియోజక వర్గం నుంచి తెలంగాణాలోని మక్తల్ నియోజక వర్గంలోకి రాహుల్ అడుగు పెడతారు. అక్కడి నుంచి దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట, శంకరంపేట, మద్నూరుల మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తారు. మొత్తానికి తెలంగాణాలో రాహుల్ 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర నడుస్తారు.

రాహుల్ వెంట రోజూ ఓ పార్లమెంటు నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొంటారు. తెలంగాణాలో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ పాదయాత్రను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ర్యాలీలు నిర్వహిస్తోంది. ఆ వేడిని భారీగా పెంచేసి.. రాహుల్ యాత్ర తెలంగాణాలో అడుగు పెట్టే సమయానికి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెంచేలా చేయాలని పార్టీ అగ్ర నేతలు స్కెచ్ వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్ పాదయాత్ర 4 రోజులు.. 100 కిలోమీటర్ల మేర జరగనుంది. రాయదుర్గం, ఆలూరు, ఆదోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. ఏపీలో పాదయాత్రను విజయవంతం చేసేందుకు సమన్వయకర్తగా కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డిని నియమించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైంది. ఆ పార్టీకి ఇక్కడ సమర్ధులైన నేతలు కూడా లేరు. రాహుల్ యాత్ర సందర్భంగా వైసీపీ వైపు వెళ్లిపోయిన కాంగ్రెస్ శ్రేణులను, ఓటర్లను మళ్లీ తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించనున్నారు. అయితే.. రాహుల్ యాత్రను పార్టీకి అనుకూలంగా మార్చ గలిగే నాయకులు లేకపోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది.