ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. 179 మంది మృతి
ఇండోనేషియాలో ఘోరం జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్ రీజెన్సీలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. జావానీస్ క్లబ్‌కు చెందిన అరెమా, పెర్సెబయా సురబయ జట్ల మధ్య మ్యాచ్ తర్వాత జరిగిన ఈ దుర్ఘటనలో 179 మంది మృతి చెందారు. 180 మందికి పైగా గాయపడ్డారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అరెమా జట్టు 2-3 తేడాతో ఓడిపోయింది.

బాష్పవాయువు గోళాల వల్లే తొక్కిసలాట..
దీంతో పెర్సబయా జట్టు అభిమానులు కేకలు, ఈలలు వేస్తూ అరెమా జట్టు అభిమానులను హేళన చేశారు. ఫలితంగా రెండు జట్ల అభిమానుల మధ్య ప్రారంభమైన గొడవ బాహాబాహీకి దారి తీసింది. బయట ఉన్న అభిమానులు సైతం స్టేడియంలోకి వచ్చి చిత్తుగా కొట్టుకున్నారు. పోలీసులు తక్కువ మంది ఉండటంతో ఆందోళనకారులను అదుపు చేయలేకపోయారు. లాఠీచార్జి చేసినా గొడవ సద్దుమణగక పోవడంతో పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. దీంతో వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా గేట్ల వద్దకు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది.

శవాలపై నుంచే పరుగులు..
తొక్కిసలాట జరగడంతో చిన్న పిల్లలు, మహిళలు సహా 125 మంది చనిపోయారు. చనిపోయిన వారి శవాలపై నుంచే ప్రేక్షకులు పరుగులు పెట్టిన దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం టియర్ గ్యాస్ ప్రయోగించడమేనని.. గేట్లు సరైన సమయానికి తెరవక పోవడంతో ప్రేక్షకులు బయటికి వెళ్లలేక పోయారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషాద ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఇండోనేషియా క్రీడా మంత్రి దేశంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వారం రోజుల పాటు నిషేధించినట్లు ప్రకటించారు.