Home Page SliderInternational

 రాజధానిని తరలించనున్నఇండోనేషియా- నూతనరాజధాని నిర్మాణం ఎక్కడంటే..

Share with

ఇండోనేషియా రాజధాని ‘జకార్తా’ అని అందరికీ తెలుసు. కానీ త్వరలోనే రాజధాని మారిపోబోతోంది.  బోర్నియో ద్వీపంలో తూర్పున ఉన్న కాలిమాంటన్ అటవీప్రాంతంలో ‘నుసంతర’ అనే పేరుతో నూతన నగర నిర్మాణం చేపట్టింది. ‘నుసంతర’ అంటే ద్వీప సముదాయం అని అర్థం. క్రిక్కిరిసిన జనాభా, పర్యావరణ మార్పులతో ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది జకార్తా. ఇండోనేషియా కొన్నిదీవుల సముదాయం. జావా ద్వీపంలో జకార్తా ఉంది. అయితే గ్రేటర్ మెట్రో పాలిటన్ నగరంతో కలిసి, జకార్తాలో  జనాభా నాలుగు కోట్లకు పైగా ఉంది. జనాభా ఒత్తిడి , భారీ భవనాల నిర్మాణం వల్ల జావా సముద్రతీరంలో  భూమి ప్రతీ సంవత్సరం కొన్ని సెంటీమీటర్లు భూమిలోకి క్రుంగిపోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రమట్టం కన్నా భూమి క్రిందికి చేరుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల మూడింట ఒకొంతు భూమి సముద్రంలో మునిగి పోతుంది.

క్రుంగిపోతున్న జకార్తా

దీనివల్ల రాజధాని నగరాన్ని మార్చాలని ప్రభుత్వం కొన్నాళ్ల క్రితమే నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రాజధాని నగరం ప్రస్తుత రాజధాని జకార్తాకు రెండువేల కిలోమీటర్ల దూరంలో ఉంది. గత సంవత్సరం ప్రారంభించిన ఈ నగర నిర్మాణంలో శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వభవనాలు, ఇతర ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రాజధాని ఎలా ఉంటుందో తెలియజేస్తూ త్రీడీ విజువల్స్ కూడా అందుబాటులో ఉంచారు. కొత్త నగరానికి ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్ వర్తింపజేస్తున్నారు.

ఈ నగరం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తూండడం వల్ల పచ్చని వృక్షాలు, ఉద్యానవనాలకు కొదవలేదు. ఇంకా భవనాల చుట్టూ, రహదారుల వెంట మొక్కలు పెంచుతున్నారు. అత్యాధునిక నీటి పారుదల వ్యవస్థలు, సౌరవిద్యుత్, డ్రైనేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అధ్యక్ష భవనం దేశ జాతీయ చిహ్నమైన గరుడ ఆకృతిలో నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఆగస్టు కల్లా ఈ భవన నిర్మాణం పూర్తికానుంది. వచ్చే ఏడాది  వారి స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 17 నాడు ఈ నగరాన్ని ప్రారంభిస్తున్నారు. పూర్తి స్థాయిలో నగర నిర్మాణం పూర్తి కావడానికి మరొక ఇరవైయేళ్ల కాలం పడుతుందని అంచనాలు వేస్తున్నారు.

నూతన రాజధానిపై స్థానికుల ఆందోళన

కానీ ఈ నిర్మాణాలపై ప్రకృతి ప్రేమికులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ అటవీ ప్రాంతంలో ఉండే అరుదైన వన్యప్రాణుల మనుగడకు ఈ రాజధాని వలన ఇబ్బందులు కలుగుతాయని, అటవీ ప్రాంతంలోని కొన్ని వేల హెక్టార్ల భూమిని నిర్మాణాలతో నిండిపోవడం వల్ల వృక్షసంపద నశించి పోతుందని హెచ్చరిస్తున్నారు. అక్కడి గిరిజన జాతులు కూడా తమ ప్రదేశాలు వదిలి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటికే ఐదు గ్రామాలు ఖాళీ చేయించి రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు. అనంతరం మరిన్ని గ్రామాలు ఖాళీ చేయవలసి ఉంటుంది.