ఉద్యోగుల జీతాలపై మంత్రులెందుకు నోరు విప్పరు? ఎమ్మెల్సీ అశోక్‌బాబు
ప్రతి అంశంపై రాజకీయ విమర్శలు చేసే మంత్రులు ఉద్యోగుల జీతాలపై ఎందుకు నోరు విప్పరని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు నిలదీశారు.
మంగళగిరి: ప్రతి అంశంపై రాజకీయ విమర్శలు చేసే మంత్రులు ఉద్యోగుల జీతాలపై ఎందుకు నోరు విప్పరని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు నిలదీశారు. చిలక పలుకులతో జగన్‌ను వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా.. ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రిని అడగలేరంటూ విమర్శించారు. జీతాలు, పింఛన్‌లకు నెలకు రూ.5,500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటే, జగన్ సర్కార్ నేటికి కూడా మొత్తం చెల్లించకుండా కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. అగ్నిపర్వతంలోని లావాలా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా దహిస్తారని మండిపడ్డారు. ఉద్యోగులు, టీచర్లు తమతో లేరని సకల శాఖల మంత్రి అన్నప్పుడే వారిపై జగన్ వైఖరి ఏమిటో అర్థమైందన్నారు.