NewsTelangana

వైఎస్సార్ టీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ

Share with

రంగంలోకి విజయమ్మ… తెలంగాణలో అనూహ్య మార్పులు రానున్నాయా… అంటే అవుననే అన్పిస్తున్నాయ్ పరిణామాలు… వైఎస్ విజయమ్మ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కుమారుడు వైఎస్ జగన్ ఏపీలో ముఖ్యమంత్రిగా వ్యవహరించడంతోపాటు… తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడంతో.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విజయమ్మ… ఇకపై పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కుమార్తె షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినా.. అనుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో.. ఇక తనే నేరుగా రంగంలోకి దిగాలని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి సైతం రాజీనామా చేశారు. ఇకపై షర్మిలకు తెలంగాణలో అండగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. షర్మిలకు తన అవసరం ఉందని కూడా చెప్పడం ద్వారా.. ఆమె అసలుసిసలు రాజకీయాన్ని ఆరంభించబోతున్నట్టు తెలుస్తోంది.


వైఎస్‌కు పులివెందులలో నివాళులర్పించిన షర్మిల కాసేపట్లో హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తల్లి విజయమ్మ ఇకపై తనకు రథసారధిగా ఉంటారని ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇకపై తెలంగాణ రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకోవాలన్న భావనకు విజయమ్మ వచ్చినట్టు తెలుస్తోంది. కుమార్తె ఎంతగా ప్రజల్లోకి వెళ్లేందకు ప్రయత్నిస్తున్నా… పరిస్థితులు అంతగా సహకరించకపోవడంతో… తాజా నిర్ణయం తీసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఇకపై ఎస్సార్‌టీపీ గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ విజయమ్మ ఉండే అవకాశం ఉంది.