కరాటే ముసుగులో నిజామాబాద్‌లో అసాంఘిక కార్యకలాపాలు
ఓ వర్గానికి చెందిన అమాయక యువకులకు మాయమాటలు చెప్పి, సేవా ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ మరో ఎనిమిది సంస్థలు కూడా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఫ్రంట్ సభ్యుల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఆ రిపోర్టు ప్రకారం యువకులకు కరాటే, కుంగ్‌ఫూ వంటి విద్యలతో పాటు రాళ్ల దాడి, కత్తి వినియోగంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇతర వర్గాలపై ద్వేషం కలిగేలా రెచ్చగొడుతున్నారు. సమాజ సేవ పేరుతో విరాళాల సేకరణ, పాఠశాలలు, కళాశాలలలో తమ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. ఊరేగింపులు, నిరసన కార్యక్రమాల సందర్భంగా రాళ్లు విసిరి హింసాత్మకంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, గుంపులోకి చొరబడి దాడులు చేయడానికి శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్ లో 200 మందికి ఇలా శిక్షణ ఇచ్చారు. వారి పూర్తి వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు.

కరాటే మాస్టర్ అబ్ధుల్ ఖాదర్ ఇంట్లో ఈనెల 4న ఆటోనగర్ పోలీసులు సోదాలు నిర్వహించి శిక్షకుడు అబ్దుల్ ఖాదర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పలు పుస్తకాలు, కత్తులతో పాటు బ్యానర్లు, సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ ఖాదర్ అరెస్టుతో ఈ నెల 6న నిజామాబాద్లో సమావేశమైన పీఎఫ్ఐ కీలక నేత షేక్ అబ్దుల్లాతో పాటు మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్లాను కూడా పోలీసులు ఆరెస్ట్ చేశారు. 28 మందిని గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నిజామాబాద్ పోలీసులు వారిలో 22 మందిని అరెస్ట్ చేసారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కడప, కర్నూల్ , నెల్లూరులోనూ వీరి సభ్యులను గుర్తించారు. ఆల్ ఖైదా కనుసన్నల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు జరుగుతున్నాయని, సిమీతో సైతం వీరికి సంబందాలున్నాయని గుర్తించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం వీరి ప్రధాన ఉదేశం. ఇస్లాం కోసం యుద్ధం చెయ్యాలంటూ చురుకైన ముస్లిం యువకులను పెడదోవ పట్టిస్తారు. ఇతర మతాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయాలని రెచ్చగొడతారు. ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం కరాటే, స్టోన్ ఫెల్టింగ్, కత్తులతో శిక్షణ ఇస్తూ యువకులను తప్పుదోవ పట్టిస్తారు. ఇస్లామిక్ సాహిత్యం, డైరీలు, సంస్థ కార్యకలాపాలపై రాసుకున్న నోట్ బుక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.