Politicstelangana,

నర్సంపేటలో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ కీలక నేతల అరెస్ట్


మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ అగ్రనేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారిలను రఘునాథపల్లి వద్ద, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను స్టేషన్ ఘనపూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా కార్యకర్తలు భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నర్సంపేట డిపోలో 22 ఏళ్లుగా పనిచేసిన శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు కార్మికులు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఇందుకు నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. తమ సహచర ఉద్యోగిని కడసారి చూసుకునేందుకు అనుమతించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ ఉద్రిక్తతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన ఆయన, కార్మికులు, కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. డిపో వద్ద నివాళులర్పించేందుకు అనుమతించాలని, అది ఆయన ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని పోలీసు అధికారులను కోరారు.