రాష్ట్రంలో వ్యవసాయ శాఖా మంత్రి ఉన్నారా?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎసీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ‘డైవర్షన్ రాజకీయాలు’ చేస్తున్నారని మండిపడ్డారు.
“రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖా మంత్రి ఉన్నారా?,” అని శైలజానాథ్ నిలదీశారు. మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి.. ఇలా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదని, రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని డప్పు కొట్టుకునే నేతలు, కేంద్రం నుండి రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే తిరుమల లడ్డూ వంటి అంశాలపై ఏళ్ల తరబడి అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
పదో తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యూషన్ కూడా సరిగా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. “ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులను విద్యాసంస్థలు వేధిస్తున్నాయి. హాస్టళ్ల దుస్థితి, నిరుద్యోగ సమస్య, మంచినీటి ఎద్దడితో జనం అల్లాడిపోతున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి,” అని ఆయన ఆరోపించారు. ప్రజల ఆస్తులను దోచుకోవడమే చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమా? అని ప్రశ్నించారు.
రాయలసీమ రైతులు సాగునీటి కోసం అల్లాడుతుంటే, ప్రభుత్వం మాత్రం అమరావతిలో నీటిని తోడటానికే కోట్లు ఖర్చు చేస్తోందని శైలజానాథ్ విమర్శించారు. “లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిలో పోస్తున్నారు. ఆ అప్పుల భారం రాయలసీమ వాసుల మీద పడుతోంది. అమరావతిపై పెట్టే ఖర్చులో కొంత రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది,” అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో యథేచ్ఛగా భూదోపిడీ జరుగుతోందని, దేవాదాయ భూములను సైతం పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారని ఆయన నిలదీశారు. ప్రజా సమస్యలు, దళితులపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు తక్షణమే ‘ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘మావిగన్’ ప్రతిపాదనకు సమాధానం చెప్పలేక, కేవలం దూషణలకు దిగడం చంద్రబాబు నైజమని శైలజానాథ్ విమర్శించారు.

